📄 ePaper
Wednesday, February 4, 2026
📄 ePaper
HomeBusiness1925లో బంగారం ధర తెలుసా? ముత్తాత ఒక నిర్ణయం తీసుకుని ఉంటే ఈరోజు మన కథే...

1925లో బంగారం ధర తెలుసా? ముత్తాత ఒక నిర్ణయం తీసుకుని ఉంటే ఈరోజు మన కథే వేరేలా ఉండేది!

ఈరోజు బంగారం పేరు వింటేనే చాలామందికి ఒకే ఆలోచన వస్తుంది.. ఇది కేవలం ఆభరణం కాదు, భవిష్యత్తుకు భరోసా.
కానీ ఒకసారి వెనక్కి వెళ్లి ఆలోచించండి… 100 ఏళ్ల క్రితం బంగారం ఎంత ఉండేదో మీకు తెలుసా..? తెలిస్తే నిజంగానే షాక్ అవ్వాల్సిందే..

ఈరోజు 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.1,44,000. ఈ స్థాయిలో ధర ఉంటుందని అప్పట్లో ఎవరైనా ఊహించారా..? అప్పటి మన ముత్తాతలు, తాతలు బంగారాన్ని కేవలం పెళ్లిళ్లు, పండుగలు, ఆభరణాల కోసమే కొనేవారు. ఇది భవిష్యత్తు తరాలకు కోట్ల విలువ చేసే ఆస్తిగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అప్పట్లో కొంచెం ఎక్కువగా బంగారం కొని పెట్టి ఉంటే.. ఈరోజు మన కుటుంబ ఆస్తుల లెక్కలు పూర్తిగా వేరేలా ఉండేవేమో అనే ఆలోచన రావడం సహజమే.

1925 నుంచి 2025 వరకు బంగారం ధర ప్రయాణం

1925 సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.19 మాత్రమే. అప్పటి రోజుల్లో అది చిన్న మొత్తం కాదు.
కానీ ఈరోజు ధరతో పోలిస్తే అది నమ్మశక్యం కానంత తక్కువ.

1940ల దశకంలో బంగారం ధర క్రమంగా పెరుగుతూ వచ్చింది.
ఆ సమయంలో 10 గ్రాములు రూ.36 నుంచి రూ.50 మధ్యలో ఉండేది. అప్పటికీ బంగారం అంటే పెట్టుబడి కాదు, కేవలం అవసరం మాత్రమే.

1950 నాటికి బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.100 చేరింది. ఇప్పటికీ అది సామాన్య ప్రజలకు పెద్ద మొత్తంగానే భావించేవారు.

1970లలో అసలు మార్పు మొదలైంది.
1970లో 10 గ్రాముల బంగారం ధర రూ.184 కాగా,
1975 నాటికి అది ఏకంగా రూ.540కి చేరింది.
ఈ దశాబ్దంలోనే ప్రజల ఆలోచన మారింది. బంగారం కేవలం పొదుపు కాదు, భవిష్యత్తుకు మంచి పెట్టుబడి అని అర్థమయ్యింది.

1980లో తొలిసారిగా బంగారం ధర వెయ్యి రూపాయల మార్కును దాటింది. ఆ సమయంలో 10 గ్రాముల ధర దాదాపు రూ.1,300. ఇది అప్పట్లోనే పెద్ద సంచలనంగా మారింది.

1990 నాటికి బంగారం ధర మరింత పెరిగి రూ.3,200కి చేరింది.
ఇక అప్పటి నుంచి బంగారం ధర వెనక్కి తిరిగి చూసిన దాఖలాలు లేవు.

2000 సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.4,400. అప్పటికీ చాలామందికి ఇది ఖరీదైనదిగానే అనిపించేది.

2010 నాటికి ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక సంక్షోభాల ప్రభావంతో
బంగారం ధర రూ.18,000 దాటింది.

2020 తర్వాత బంగారం ధరలు వేగంగా పెరిగాయి.
2024 నాటికి 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.70,000.

2025లో బంగారం ధర నిజంగా స్వర్ణయుగాన్ని తలపిస్తోంది.
ఈ ఒక్క సంవత్సరంలోనే ధర దాదాపు డబుల్ అయింది.
ఈరోజు 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,000 దగ్గర ట్రేడ్ అవుతోంది.

Gold price comparison between 1925 and 2025 showing historical and modern gold value in India
A visual comparison of gold’s value journey from the 1920s to modern times

అప్పట్లో ముత్తాత 1 కిలో బంగారం కొని ఉంచి ఉంటే?

1925లో 1 కిలో బంగారం ధర సుమారు రూ.1,900 మాత్రమే.
ఈరోజు అదే బంగారం విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది.

అందుకే ఇప్పటికీ చాలామందికి ఒకే భావన.. ముత్తాత అప్పట్లో కొంచెం బంగారం కొని పెట్టి ఉంటే ఎంత బాగుండేదో..!

ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఒక్కటే.
బంగారం ధర ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎప్పటికప్పుడు పెరుగుతూ, పడుతూ ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో మాత్రం బంగారం ఎప్పుడూ విలువ కోల్పోలేదు. అందుకే ఇప్పటికీ బంగారం భద్రమైన పెట్టుబడిగా, భవిష్యత్తుకు భరోసాగా, తరతరాలకు ఆస్తిగా కొనసాగుతూనే ఉంది.

Author : QAMAR SD , Vaasthava Nestham

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page