వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: 2025 సంవత్సరంలో బంగారం ధరలు ఎవ్వరూ ఊహించని స్థాయిలో పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి, ఆర్థిక ఆందోళనలు, జియోపాలిటికల్ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం సేఫ్ హెవెన్‌గా మరింత బలపడింది. ఏడాది మొత్తంగా చూస్తే బంగారం ధరలు దాదాపు 70 శాతం వరకు పెరిగినట్లు మార్కెట్ గణాంకాలు సూచిస్తున్నాయి.
గత ఏడాదిలో బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డ్‌ను తాకాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.1.45 లక్షల స్థాయికి చేరింది. ఈ ర్యాలీ తర్వాత ధరలు కొంత స్థిరపడతాయని అంచనా వేసినా, 2026లో కూడా బంగారం ధరలు బలంగా కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో యూరప్‌కు చెందిన ప్రముఖ కాలజ్ఞాని, బల్గేరియా దేశానికి చెందిన బాబా వంగా పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మరోసారి చర్చకు దారి తీసింది. బాబా వంగా ముందుగానే చేసిన అంచనాల ప్రకారం 2026 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉందని ఆమె ఊహించినట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు.
బ్యాంకింగ్ వ్యవస్థలు కుప్పకూలటం, కరెన్సీ విలువలు భారీగా పడిపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చని ఆమె హెచ్చరించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు ఇన్వెస్టర్లు రిస్క్ ఉన్న పెట్టుబడుల నుంచి బయటకు వచ్చి బంగారం, వెండి వంటి సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు.
ఈ డిమాండ్ ఇలాగే కొనసాగితే భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.2 లక్షల వరకు చేరే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కొందరు అంచనా వేస్తున్నారు. ఇదే కారణంగా బంగారంపై పెట్టుబడులపై ఆసక్తి మరోసారి పెరుగుతోంది.
అదే సమయంలో 2026 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా నగదు కొరత ఏర్పడే అవకాశం ఉందని బాబా వంగా ముందుగానే చెప్పినట్లు అనుచరులు పేర్కొంటున్నారు. భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా ఆమె హెచ్చరించినట్లు ప్రచారం సాగుతోంది.
ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి నియంత్రణ నుంచి బయటకు వెళ్లి సవాలుగా మారుతుందని, 2026 నవంబర్ నాటికి గ్రహాంతరవాసులతో మనుషులకు పరిచయం ఏర్పడుతుందని కూడా బాబా వంగా అంచనా వేసినట్లు సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి.

అయితే బాబా వంగా పేరుతో జరుగుతున్న ఈ ప్రచారంపై ఆర్థిక విశ్లేషకులు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమేనని, వాటిని గుడ్డిగా నమ్మి పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. బంగారం ధరలు అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లు, డాలర్ విలువ, కేంద్ర బ్యాంకుల విధానాలపై ఆధారపడి ఉంటాయని వారు స్పష్టం చేస్తున్నారు.
Disclaimer: పై కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడింది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి లేదా ఆర్థిక సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం, వెండి వంటి అన్ని పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోబడి ఉంటాయి. పెట్టుబడి లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు మీ సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించడం ఉత్తమం.
Author: QAMAR SD

