బంగారం ధర రోజురోజు పెరగడం కొనాలనుకునే వారికి ఇది షాక్ న్యూస్. ప్రపంచ మార్కెట్లలో పసిడి ధరలు రోజుకో కొత్త రికార్డును తాకుతూ ముందుకు సాగుతున్నాయి. అంతర్జాతీయంగా ఒక్క ఔన్స్ బంగారం ధర తాజాగా $4,850 మార్కును దాటింది. ఇది భారత కరెన్సీలో చూస్తే దాదాపు ₹4.4 లక్షలు. మార్కెట్‌లో కనిపిస్తున్న ఈ వేగాన్ని బట్టి చూస్తే… ఈ వారం ముగిసేలోపే $5,000 మైలురాయి కూడా సాధ్యమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అది జరిగితే బంగారం చరిత్రలోనే అతిపెద్ద సంచలనంగా నిలిచే అవకాశం ఉంది. పెట్టుబడిదారులు భారీగా బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో ‘ సేఫ్ హావెన్ ’గా పసిడి మరోసారి తన విలువను చాటుకుంటోంది. స్టాక్స్, బాండ్లలో ఊగిసలాట పెరిగిన ప్రతిసారీ బంగారం డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతోంది.
బంగారం ర్యాలీకి అసలు కారణాలే ఇవే..
గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ప్రపంచ వాణిజ్యాన్ని మరోసారి అనిశ్చితిలోకి నెట్టుతున్నాయి. గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయాలన్న ప్రతిపాదన, యూరోపియన్ యూనియన్‌పై కొత్త టారిఫ్‌ల విధింపు… ఇవన్నీ ట్రేడ్ వార్ భయాలను మరింత పెంచుతున్నాయి. ఇదే సమయంలో అమెరికా ట్రెజరీ బాండ్ల నుంచి పెట్టుబడులు బయటకు వస్తుండటంతో డాలర్ బలహీనపడుతోంది. డాలర్ బలహీనపడిన ప్రతిసారి బంగారం ధరలు ఎగబాకడం సహజం. జపాన్ మార్కెట్లలో పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్ కూడా ఈ ర్యాలీకి మద్దతుగా నిలుస్తున్నాయి. ప్రముఖ మెటల్ అనలిస్ట్ రషాద్ హాజియేవ్ మాటల్లో చెప్పాలంటే… “బంగారం ఎవరికి అవకాశం ఇవ్వకుండా నేరుగా $5,000 దిశగా దూసుకుపోతోంది.” మార్కెట్ రిపోర్టులు కూడా ఈ వారం కొత్త రికార్డులు ఖాయమనే సంకేతాలు ఇస్తున్నాయి.
మన దేశంలో ధరలు ఎలా ఉన్నాయి..?
అంతర్జాతీయంగా $4,850/ఔన్స్ అంటే… భారత మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర ₹1.50 లక్షల నుంచి ₹1.5 లక్షల మధ్య ట్రేడ్ అవుతోంది(పన్నులతో కలిపి). ఒకవేళ గనుక గోల్డ్ రేట్ $5,000 మార్కును తాకితే… మన దగ్గర తులం బంగారం ధర మరింత ఎగబాకే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెళ్లిళ్ల కోసం కొనుగోలు చేసే వారు, ఇన్వెస్టర్లు… అందరూ ఇప్పుడు ధరల్ని ఆందోళనగా గమనిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కొన్ని పరిస్థితుల నేపథ్యంలో బంగారం విలువ మరింత బలపడుతోంది. ఈ ట్రెండ్ కొనసాగితే సామాన్యుడికి బంగారం కల మరింత దూరమయ్యే ప్రమాదం ఉంది. పెట్టుబడిదారులకు ఇది రక్షణ కవచంగా మారుతుంటే, కొనుగోలుదారులకు మాత్రం ఖరీదైన పరీక్షగా మారుతోంది.
Written by: Qamar SD, Vaasthava Nestham Editorial Team,Published: January 22, 2025 | 02:00 PM

