• అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో సాధారణ కుటుంబాలకు అందని బంగారం
కొన్ని వందల సంవత్సరాల క్రితమే కాలాన్ని, సమాజ మార్పులను ఊహించిన కాలజ్ఞానం చెప్పిన మహానుభావుల్లో బ్రహ్మంగారు ఒకరని విశ్వసించే వారి సంఖ్య ఇప్పటికీ తక్కువేమీ కాదు. ఆయన చేసిన అనేక ప్రవచనాలు నేటి పరిస్థితులకు అచ్చుగుద్దినట్లుగా సరిపోతున్నాయన్న వాదనలు తరచూ వినిపిస్తుంటాయి. తాజాగా అదే కోవలోకి వస్తున్న అంశం… బంగారం ధరలు, మహిళల మంగళసూత్రాల వినియోగంపై బ్రహ్మంగారి అంచనాలు నిజమవుతున్నాయా అని చాచా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. భవిష్యత్తులో మహిళలు బంగారు మంగళసూత్రాల స్థానంలో తక్కువ విలువైన వస్తువులు ధరించే పరిస్థితి వస్తుందని బ్రహ్మంగారు చెప్పారని కొందరు విశ్వసిస్తున్నారు. అప్పట్లో ఇది ఊహాగానంగా అనిపించినా, నేటి బంగారం ధరలను చూస్తే ఆ మాటలు నిజమవుతున్నాయేమో అనే భావన ప్రజల్లో బలపడుతోంది.
గత ఏడాది కాలంగా బంగారం ధరలు నిరంతరంగా పెరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు భద్రతా పెట్టుబడిగా భావించిన బంగారం, ఇప్పుడు భారంగా మారింది. ఇటీవల జనవరి 21న ఒక్కరోజులోనే బంగారం ధర రూ.800కు పైగా పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల ధోరణిలో మార్పులు ఇందుకు ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,57,260 దాటగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,000కు పైగా చేరింది. ఒక సాధారణ బంగారు గొలుసు కొనాలన్నా లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ కొనుగోలుదారులకు మరో భారంగా మారుతున్నాయి.
హిందూ సంప్రదాయాల్లో వివాహ సమయంలో మంగళసూత్రం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా, బంగారం తప్పనిసరి అన్న భావన తరతరాలుగా కొనసాగుతోంది. కానీ నేటి పరిస్థితుల్లో ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో కొన్ని కుటుంబాలు ఇప్పటికే తక్కువ బరువు ఆభరణాలు, గోల్డ్ ప్లేటెడ్ ఆభరణాలు లేదా ప్రత్యామ్నాయ లోహాల వైపు మొగ్గు చూపుతున్నాయి.
నిపుణుల అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే బ్రహ్మంగారి ప్రవచనాలపై చర్చ మరింత ఊపందుకోవడం ఖాయం. సంప్రదాయాలు కాలానుగుణంగా మారతాయా? లేక బంగారం కోసం సమాజం మరో మార్గం వెతుకుతుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.

బంగారం ధరల పెరుగుదల కేవలం ఆర్థిక అంశమే కాదు, సామాజిక మార్పులకు సంకేతంగా కూడా మారుతోంది. సంప్రదాయాలపై భారం పెరిగినప్పుడు, సమాజం సహజంగానే కొత్త మార్గాలను అన్వేషిస్తుంది. బ్రహ్మంగారి చెప్పిన ప్రవచనాలు ఈ మార్పులను ప్రజలకు మరింత దగ్గర చేస్తోంది.
Written by: Nestham Editorial Team, Published:January 23, 2025 | 08:03 AM
