• ఐటిడిఏ పిఓ యువరాజ్ మార్మాట్
వాస్తవ నేస్తం,ఉట్నూర్: విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మేడిగూడ ఆశ్రమ పాఠశాల (Mediguda aashram High School) హెడ్‌మాస్టర్ స్వర్ణలతను సస్పెండ్ చేస్తూ ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్ట్ ఆఫీసర్(itda project officer) (పీఓ) యువరాజ్ మార్మాట్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందించాల్సిన భోజనాన్ని నిర్దేశిత మెనూ ప్రకారం అందించకపోవడం, భోజన నాణ్యత లోపించడం, కొన్ని సందర్భాల్లో విద్యార్థులకు సరిపడా భోజనం ఇవ్వకపోవడం వంటి అంశాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై నిర్వహించిన ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమని తేలినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా, పాఠశాల హాజరు పట్టికలో వాస్తవానికి కంటే ఎక్కువ మంది విద్యార్థుల హాజరును నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి ప్రయత్నించినట్లు కూడా గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్న ప్రాజెక్ట్ అధికారి హెడ్‌మాస్టర్ ఆర్. స్వర్ణలతను తక్షణమే సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేదని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని ఈ సందర్భంగా పీఓ స్పష్టం చేశారు.
