📄 ePaper
Wednesday, March 25, 2026
📄 ePaper
HomeBusinessSilver | భారీగా పెరిగిన వెండి ధరలు.. దివాలా వెండి వ్యాపారులు.!

Silver | భారీగా పెరిగిన వెండి ధరలు.. దివాలా వెండి వ్యాపారులు.!

వాస్తవ నేస్తం,బిజినెస్ డెస్క్: వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ ఒకవైపు పెట్టుబడిదారులు భారీ లాభాలు పొందుతుంటే, మరోవైపు ఈ ధరల పెరుగుదలే పలువురు వ్యాపారులను రోడ్డున పడేసింది. దేశంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ పరిణామం మార్కెట్ వర్గాలను షాక్‌కు గురి చేసింది. పెరుగుతున్న వెండి ధరల కారణంగా మొత్తం 44 మంది వెండి వ్యాపారులు దివాలా ప్రకటించాల్సి వచ్చినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఈ వ్యాపారులు మొత్తం సుమారు రూ.3,500 కోట్ల విలువైన అప్పులను చెల్లించలేని పరిస్థితికి చేరుకున్నారని సమాచారం. వెండి ధరలు ఈ స్థాయిలో పెరుగుతాయని ఊహించని వ్యాపారులు, మార్కెట్ అస్థిరతలో చిక్కుకుని తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.

రాజ్‌కోట్ కేంద్రంగా పనిచేసే పలువురు వెండి వ్యాపారులు ధరలు ఒక స్థాయిలోనే నిలిచిపోతాయని భావించి ముందుగానే వెండిని విక్రయించారు. అయితే అంచనాలకు విరుద్ధంగా వెండి ధరలు కిలోగ్రాముకు రూ.1.25 లక్షల మార్కును దాటుతూ దూసుకెళ్లాయి. 2025లో ఈ స్థాయికి ధరలు చేరవని భావించిన వ్యాపారులు, ధరల అస్థిరతకు తట్టుకోలేకపోయారు.

మార్కెట్‌లో అమ్మకపు ధరకు, ప్రస్తుత మార్కెట్ ధరకు (స్థానికంగా దీనిని ‘వాలన్’గా పిలుస్తారు) మధ్య వ్యత్యాసం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో నష్టాలు నియంత్రణ తప్పిన స్థాయికి చేరాయి. ధరలు ఎంత పెరుగుతున్నా, అప్పటికే చేసిన ఒప్పందాల కారణంగా వెండిని తక్కువ ధరలకే సరఫరా చేయాల్సి రావడంతో వ్యాపారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం రాత్రి వెండి వ్యాపారులు అత్యవసర సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఈ సమావేశంలో 44 మంది వ్యాపారులు తమ అప్పులను తిరిగి చెల్లించలేమని, మార్కెట్ ఒత్తిడికి లొంగిపోయామని అంగీకరించినట్లు తెలుస్తోంది. కొందరు వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసి మార్కెట్ నుంచి పూర్తిగా తప్పుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి :  బంగారం ఆల్‌టైమ్ రికార్డు..! ఔన్సు ధర $4,600 దాటింది – వెండి కూడా ఆగడం లేదు

ఈ షాక్ ప్రభావం రాజ్‌కోట్‌కే పరిమితం కాకుండా అహ్మదాబాద్, ఇండోర్, దుబాయ్ వంటి వాణిజ్య కేంద్రాలకు కూడా విస్తరించినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. వెండి ధరలు రూ.1.25 లక్షల స్థాయిని దాటవని నమ్మి కొనసాగించిన విక్రయాలు చివరకు భారీ ఆర్థిక భారంగా మారాయి.

వెండి ధరలు పెట్టుబడిదారులకు లాభాల వర్షం కురిపిస్తున్నా, వ్యాపారులకు మాత్రం ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. మార్కెట్ అంచనాలు తప్పితే వచ్చే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలిపే తాజా ఉదాహరణగా ఈ ఘటన నిలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page