వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: అంతర్జాతీయ పరిణామాలు మరోసారి బులియన్ మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. గత ఏడాది పొడవునా యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలతో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. కొత్త ఏడాదిలో అయినా ధరలు తగ్గుతాయన్న అంచనాలకు తాజా పరిణామాలు బ్రేక్ వేశాయి.
ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతుండగా, తాజాగా వెనిజులా సంక్షోభం తీవ్రతరంగా మారింది. ఈ ప్రభావంతో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దూసుకుపోతున్నాయి. కొనుగోలుదారులు మార్కెట్ వైపు చూసేందుకు కూడా వెనకాడే పరిస్థితి నెలకొంది.
ఈరోజు వెండి ధర ఏకంగా దూకుడు చూపించింది. ఒక్కరోజులోనే కిలో వెండిపై రూ.10,000 వరకు పెరుగుదల నమోదు కావడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.
దీంతో హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,83,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ వేగం కొనసాగితే అతి త్వరలోనే వెండి ధర రూ.3 లక్షల మార్క్‌ను తాకే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బులియన్ మార్కెట్‌లో ఈరోజు సగటున కిలో వెండి ధర రూ.2,63,000 దగ్గర ఉంది. అయితే హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో మాత్రం వెండి ధర మరింత ఎక్కువగా రూ.2,83,000 వద్ద కొనసాగుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,63,000 పరిధిలో ట్రేడ్ అవుతోంది.
వెండితో పాటు బంగారం ధరలు కూడా తగ్గే సూచనలు ఇవ్వడం లేదు. ఈరోజు తులం బంగారం ధరపై మరోసారి పెరుగుదల నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.660 పెరగడంతో రూ.1,39,480 వద్ద ట్రేడ్ అవుతోంది.
అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.600 పెరిగి రూ.1,27,850గా నమోదైంది.18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.490 పెరుగుదలతో రూ.1,04,610 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి, రాజకీయ సంక్షోభాలు కొనసాగుతున్న నేపథ్యంలో బులియన్ ధరలు సమీప కాలంలో తగ్గే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెట్టుబడిదారులు, వినియోగదారులు మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
Author: QAMAR SD
