HomeTelanganaవిద్యుత్ స్తంభం ముట్టుకుంటే.. షాకే..!

విద్యుత్ స్తంభం ముట్టుకుంటే.. షాకే..!

📰 Generate e-Paper Clip

• చెట్లపై ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ వైర్లు

• హనుమాన్ ఆలయ సమీపంలో భయాందోళనలో భక్తులు

• తక్షణమే సమస్యను పరిష్కరించాలని వర్తమన్నూర్ గ్రామస్థుల విజ్ఞప్తి

 

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : జిల్లాలోని బజార్హత్నూర్ మండలం వర్తమన్నూర్ గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. గ్రామంలోని స్థానిక హనుమాన్ దేవాలయం సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాల వద్ద కరెంట్ లీకై షాక్ కొడుతుండటంతో ప్రజలు అటువైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. దీనికి తోడు వీధుల్లోని విద్యుత్ వైర్లు చెట్ల కొమ్మలపై ప్రమాదకరంగా కిందకు వేలాడుతుండటంతో ఏ క్షణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంటుందోనని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హనుమాన్ ఆలయానికి నిత్యం భక్తులు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. సరిగ్గా జనసంచారం అధికంగా ఉండే ఇలాంటి ప్రాంతంలోనే స్తంభాలకు షాక్ వస్తుండటం, వైర్లు కిందకు వేలాడుతుండటం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలివాన వస్తే చెట్ల కొమ్మలు కదిలి వైర్లు తెగిపడే ప్రమాదం పొంచి ఉందని వారు గుర్తుచేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది తక్షణమే స్పందించి పరిస్థితిని సమీక్షించాలని ప్రజలు కోరుతున్నారు. స్తంభాలకు వస్తున్న లీకేజీని అరికట్టడంతో పాటు, చెట్లపై ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ వైర్లను సురక్షితంగా సరిచేసి పెను ప్రమాదం జరగకముందే ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని వర్తమన్నూర్ గ్రామస్థులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!

జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular