ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో బంగారం ఒక కొత్త అధ్యాయాన్ని రచించబోతుందా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి బంగారం ధరలు ఆకాశాన్ని తాకడానికి కారణం అవుతుందా అంటే అవునని అనాలి.. బంగారం మరోసారి తన అసలైన శక్తిని చూపిస్తోంది. బుధవారం అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరాయి. ఒక్క ఔన్సు బంగారం ధర 4,800 డాలర్లను దాటడంతో గోల్డ్ మార్కెట్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వాణిజ్య యుద్ధాల భయం, అమెరికా టారిఫ్ హెచ్చరికలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కలిసి పెట్టుబడిదారులను భద్రమైన పెట్టుబడుల వైపు నడిపిస్తున్నాయి. ఆ జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తోంది బంగారం.
రికార్డుల మీద రికార్డులు… 2025లో గోల్డ్ సూపర్ ర్యాలీ
2025 సంవత్సరం బంగారానికి బ్లాక్‌బస్టర్ ఏడాదిగా మారింది. ఇప్పటికే వరుస రికార్డులు బద్దలైన నేపథ్యంలో, ఈ ఏడాది కూడా అదే జోరు కొనసాగుతోంది. లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) నిర్వహించిన తాజా సర్వేలో పాల్గొన్న విశ్లేషకులు… ఈ ఏడాది బంగారం ధరలు 5,000 డాలర్లను కూడా దాటే అవకాశముందని అంచనా వేశారు. అమెరికాలో వాస్తవ వడ్డీ రేట్లు తగ్గడం, ఫెడరల్ రిజర్వ్ విధాన సడలింపులు, డాలర్‌పై ఆధారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.
ICBC స్టాండర్డ్ బ్యాంక్ సీనియర్ కమోడిటీస్ స్ట్రాటజిస్ట్ జూలియా డు అయితే మరింత సంచలన అంచనా వేశారు. రానున్న కాలంలో బంగారం ధరలు 7,150 డాలర్ల వరకు కూడా వెళ్లవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. అదే బాటలో గోల్డ్‌మన్ సాచ్స్ కూడా బంగారంపై తన బుల్లిష్ వైఖరిని స్పష్టం చేసింది.
కేంద్ర బ్యాంకుల నుంచి హెడ్జ్ ఫండ్ల వరకు… గోల్డ్‌కే ఓటు
గోల్డ్‌మన్ సాచ్స్ గ్లోబల్ కమోడిటీస్ రీసెర్చ్ సహ-హెడ్ డాన్ స్ట్రూయ్వెన్ ప్రకారం… 2025 చివరి నాటికి బంగారం ధర 4,900 డాలర్ల వరకు చేరడం ప్రాథమిక అంచనా. గత రెండేళ్లలో కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు బంగారానికి బలంగా నిలవగా, ఈ ఏడాది ప్రైవేట్ పెట్టుబడిదారులు, సంపద నిర్వహణ సంస్థలు, హెడ్జ్ ఫండ్లు, పెన్షన్ ఫండ్లు పెద్దఎత్తున గోల్డ్ వైపు అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా ETFల ద్వారా వస్తున్న పెట్టుబడులు ఈ మార్పుకు స్పష్టమైన సంకేతంగా మారాయి.
ఇక MKS PAMP మెటల్స్ స్ట్రాటజీ హెడ్ నిక్కీ షీల్స్ మాట్లాడుతూ… ప్రస్తుత గోల్డ్ ర్యాలీ ఊహాజనిత బుడగ కాదని స్పష్టం చేశారు. ఈ ఏడాది బంగారం ధరలు 5,400 డాలర్ల వరకు చేరే అవకాశముందని ఆమె అంచనా. ప్రపంచవ్యాప్తంగా కీలక లోహాలు, వనరుల కోసం పోటీ పెరుగుతున్న నేపథ్యంలో… బంగారం ప్రాధాన్యం మరింత పెరగడం ఖాయమని ఆమె వ్యాఖ్యానించారు.

ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలు కుదుపులకు గురవుతున్న కొద్దీ… బంగారం విలువ మరింత ఎగబాకుతోంది. పెట్టుబడిదారులకు ఇది భద్రమైన ఆశ్రయంగా మారుతుంటే, సామాన్యులకు మాత్రం బంగారం కల మరింత దూరమవుతోంది. రాబోయే రోజుల్లో గోల్డ్ ధరలు కొత్త ఎత్తులను తాకితే… “పేదల బంగారం” అన్న మాట చరిత్రగా మిగిలిపోవడం ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది.
Written by: Qamar SD, Vaasthava Nestham Editorial Team, Published: January 22, 2025 | 09:05 AM
