• 150 ‘మౌళి 5G’ ప్యాకెట్లు, ఎర్టిగా కారు స్వాధీనం
• గుజరాత్ నుంచి తీసుకొచ్చి విక్రయాలకు యత్నం
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలో అమాయక రైతులను మోసం చేస్తూ నకిలీ పత్తి విత్తనాలను అక్రమంగా విక్రయిస్తున్న వ్యవహారం రట్టయ్యింది. గుజరాత్ నుంచి అక్రమంగా నకిలీ విత్తనాలు తీసుకొచ్చి అమాయక రైతులకు అంటగట్టేందుకు యత్నించిన ఇచ్చోడ మండలానికి చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా నకిలీ విత్తనాలను కారులో తరలిస్తున్న నిందితుడిని టాస్క్ ఫోర్స్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 150 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లతో పాటు వాటి రవాణాకు ఉపయోగించిన ఎర్టిగా కారును సీజ్ చేశారు. ఈ ఘటనపై వన్ టౌన్ సీఐ బి. సునీల్ కుమార్ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండటంతో నకిలీ విత్తనాల బెడదను అరికట్టేందుకు వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు ఉమ్మడిగా తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా గురువారం ఎన్టీఆర్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అనుమానాస్పదంగా కనిపించిన ఒక ఎర్టిగా కారును ఆపి సోదా చేశారు. ఆ కారులో ఉన్న వ్యక్తి ఇచ్చోడ మండలం ముక్రా (బి) గ్రామానికి చెందిన అడావు రవికాంత్ గా అధికారులు గుర్తించారు. అతడి కారులో మౌళి 5G’ పేరుతో ఉన్న 150 పత్తి విత్తనాల ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ప్రతి ప్యాకెట్‌లో 450 గ్రాముల విత్తనాలు ఉండగా.. వాటికి సంబంధించి ఎలాంటి కొనుగోలు బిల్లులులేకపోవడంతో సరుకును స్వాధీనం చేసుకున్నారు. మండల వ్యవసాయ అధికారి కాటిపెల్లి నాగేష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇచ్చోడ మండలానికి చెందిన రవికాంత్‌పై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
గుజరాత్ నుంచి తీసుకొచ్చి..
ఈ నకిలీ విత్తనాల వెనుక అంతర్రాష్ట్ర లింకులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన రజత్ పటేల్ అనే వ్యక్తి వద్ద నుంచి ఈ నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి, జిల్లాలోని రైతులకు అంటగట్టేందుకు రవికాంత్ వాటిని ఆదిలాబాద్‌కు తీసుకొచ్చినట్లు విచారణలో అంగీకరించాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రజత్ పటేల్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
అమాయక రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై, అక్రమ నిల్వలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సునీల్ కుమార్ హెచ్చరించారు. రైతులు ఎవరూ కూడా గ్రామాల్లో తిరిగే అనుమతులు లేని దళారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని, కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్ల వద్దే పక్కా బిల్లులతో ధృవీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా విత్తనాలు విక్రయిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు గానీ, డయల్ 100 ద్వారా సమీప పోలీసులకు గానీ సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వన్ టౌన్ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
