• తమిళనాడు కాబోయే సీఎం విజయ్ మూలాలపై ఆసక్తికర నిజాలు
• హైదరాబాద్‌తోనూ ప్రత్యేక అనుబంధం!
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రిగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న దళపతి, ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) అధినేత విజయ్ జోసెఫ్ వ్యక్తిగత నేపథ్యంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆయన మూలాలు చిత్తూరులో ఉన్నాయని కొందరు, ఆయన దళిత క్రిస్టియన్ అని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఆయన కుటుంబానికి సుదీర్ఘమైన చారిత్రక నేపథ్యం ఉందని పలు పత్రాలు, సామాజిక వర్గాల సమాచారం ద్వారా స్పష్టమవుతోంది. అంతేకాకుండా ఆయనకు హైదరాబాద్‌తో కూడా ఓ ప్రత్యేక బంధం ఉండటం విశేషం.
విజయ్ దళితుడు కాదు. ఆయన కుటుంబం ప్రాథమికంగా ‘వెల్లలార్’ సామాజిక వర్గానికి చెందింది. ఇది తమిళనాడు, కేరళతో పాటు శ్రీలంకలోనూ విస్తరించి ఉన్న బలమైన వ్యవసాయ, భూస్వామ్య సామాజిక వర్గం. సంగం, చోళుల కాలంలో పాలనాపరమైన వ్యవహారాలు, మిలిటరీ విధుల్లో వీరు కీలక పాత్ర పోషించేవారు. మౌర్యుల కాలంలోనూ, చేర-చోళ-పాండ్య రాజుల వద్ద వీరు స్థానికంగా చిన్నపాటి రాజ్యాలకు సామంతులుగా, వెలిర్ నాయకులుగా వ్యవహరించారు.
కాలక్రమంలో ఈ సామాజిక వర్గంలోని ఉడయార్ తదితర పలు ఉపకులాలను ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల (బీసీ) జాబితాలో చేర్చాయి. విజయ్ కుటుంబానిది ఉడయార్ ఉపకులం. విజయ్ తాత (తండ్రికి తండ్రి) ఎస్.ఎన్. చంద్రశేఖరన్ శ్రీలంకలో జన్మించారు. తర్వాత ఆయన కుటుంబం తమిళనాడులోని రామనాథపురానికి వలస వచ్చింది. వీరు క్రిస్టియన్ వెల్లలార్స్ విభాగానికి చెందినవారు.
తల్లి హిందూ.. తండ్రి క్రిస్టియన్..
విజయ్ తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ రామేశ్వరంలో జన్మించారు. ఆయన క్రిస్టియన్. చెన్నై వచ్చి సినీ పరిశ్రమలో దర్శకుడిగా, నిర్మాతగా స్థిరపడ్డారు. కాగా, విజయ్ తల్లి శోభ హిందూ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. ఆమె కుటుంబం హైదరాబాద్ నుంచి చెన్నైకి వలస వెళ్లింది. ప్రముఖ సింగర్, వాయిస్ ఆర్టిస్ట్ ఎస్.ఎన్.సురేందర్ ఆమె సోదరుడే. తండ్రి చంద్రశేఖర్ మొదట్లో శోభ వాళ్ల ఇంట్లోనే అద్దెకు ఉండేవారు. ఆ పరిచయం ప్రేమగా మారి, మతాంతర వివాహానికి దారితీసింది. మాతృమూర్తి వైపు నుంచి చూస్తే విజయ్‌కు హైదరాబాద్‌తో బలమైన బంధం ఉంది.
స్కూల్ రికార్డుల్లో ‘తమిళియన్’..
తమ కుమారుడికి ‘విజయ్ జోసెఫ్’ అని నామకరణం చేసినప్పటికీ.. పాఠశాల రికార్డుల్లో మాత్రం తండ్రి చంద్రశేఖర్ ఎక్కడా కులం పేరు రాయించలేదు. కులం కాలమ్‌లో కేవలం ‘తమిళియన్’ (తమిళుడు) అని మాత్రమే నమోదు చేయడం గమనార్హం.
విడాకుల వార్తలపై…
వ్యక్తిగత జీవితానికొస్తే.. 1999లో లండన్‌కు చెందిన తన అభిమాని సంగీతను విజయ్ వివాహం చేసుకున్నారు. అయితే, 27 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరి బంధం విడాకుల దిశగా పయనిస్తోందన్న వార్తలు చెన్నై వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ప్రముఖ నటితో ఉన్న సాన్నిహిత్యం వల్లే ఈ దూరం పెరిగిందని టాక్. భరణం, ఇతర సాంకేతిక అంశాల వల్ల ఈ విడాకుల ప్రక్రియ ఇంకా అధికారికంగా పూర్తి కాలేదని తెలుస్తోంది.
మొత్తంగా చూస్తే.. విజయ్ మూలాలు శ్రీలంకలో ఉన్నాయి. ఒకప్పటి అగ్రవర్ణం, ప్రస్తుత బీసీ జాబితాలో ఉన్న భూస్వామ్య వెల్లలార్ కులానికి ఆయన చెందుతారు. తండ్రి వైపు నుంచి క్రిస్టియన్ పరంపర, తల్లి వైపు నుంచి హిందూ నేపథ్యం ఆయన సొంతం. కాబట్టి, దళిత క్రిస్టియన్ అంటూ ఆయనపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవంలేదని స్పష్టమవుతోంది.
