తెరపైకి డీఎంకే-అన్నాడీఎంకేల సరికొత్త వ్యూహం..!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీ సంచలన విజయం సాధించింది. ఎన్నికల సంగ్రామంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ఎన్నికల్లో గెలవడం ఎంత ముఖ్యమో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. విజయ్ కి మెజారిటీ రాకపోవడంతో, ద్రావిడ పార్టీలైన డీఎంకే (DMK), అన్నాడీఎంకే (AIADMK) లు కలిసి ఆయన్ను అధికారానికి దూరం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అఖండ ప్రజాదరణ పొందిన విజయ్ కి ముఖ్యమంత్రి పీఠం దక్కడం అంత సులభమా..? లేక రాజకీయ చక్రబంధంలో ఆయన చిక్కుకుంటారా..? అనే చర్చ రాజకీయ విశ్లేషకులో జరుగుతోంది.
50 ఏళ్ల ద్రావిడ కోటను బద్దలు కొట్టిన విజయ్…
1967 నుండి తమిళనాడు రాష్ట్రం పూర్తిగా డీఎంకే మరియు అన్నాడీఎంకే పార్టీల గుప్పిట్లోనే ఉంది. ఈ రెండు పార్టీల ఆధిపత్యాన్ని చెదరగొట్టేందుకు ఎందరో ప్రయత్నించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ పార్టీ పెడతానని చెప్పి వెనక్కి తగ్గారు. కమల్ హాసన్ బరిలోకి దిగినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కానీ, విజయ్ ఏకంగా ఒంటరిగా 234 స్థానాల్లో పోటీ చేసి ద్రావిడ పార్టీల కోటను బద్దలు కొట్టారు.
అసలు లెక్కలు ఏంటి. ? మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 సీట్ల (మ్యాజిక్ ఫిగర్) మద్దతు అవసరం. ప్రస్తుత ఫలితాల ప్రకారం:
- TVK (విజయ్ పార్టీ): 108 సీట్లు
- DMK (స్టాలిన్ పార్టీ): 59 సీట్లు
- AIADMK (పళనిస్వామి పార్టీ): 47 సీట్లు
విజయ్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇంకా 10 సీట్ల దూరంలో ఉన్నారు. ఇప్పుడు గవర్నర్ అతిపెద్ద పార్టీగా TVK ను ఆహ్వానించినా, సభలో మెజారిటీ నిరూపించుకోవాలి. ఇందుకోసం విజయ్ ముందున్న ప్రధాన మార్గాలు ఒకసారి చూద్దాం..
TVK కు అన్నాడీఎంకే (AIADMK) మద్దతు ఇస్తే..?
విజయ్ కి ఉన్న అతి సులువైన మార్గం అన్నాడీఎంకే తో చేతులు కలపడం.
TVK (108) + AIADMK (47) = 155 సీట్లు. ఇది స్పష్టమైన మెజారిటీ.
- కొన్ని మంత్రి పదవులు ఆఫర్ చేయడం ద్వారా అన్నాడీఎంకేను విజయ్ తనవైపు తిప్పుకోవచ్చు.
- బీజేపీ కేవలం 1 సీటు మాత్రమే గెలవడంతో, ఢిల్లీ పెద్దల ఒత్తిడి లేకుండా అన్నాడీఎంకే స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
డీఎంకే పార్టీ తీవ్రమైన బ్రాహ్మణ వ్యతిరేక, నాస్తిక వాదాలతో ఉంటుంది. అన్నాడీఎంకే దానికి కాస్త భిన్నం. విజయ్ కూడా అంబేద్కర్, కామరాజ్ లాంటి నేతల సామాజిక న్యాయాన్ని, ద్రావిడ భావజాలాన్ని నమ్ముతున్నారు. అందుకే తన ప్రచారంలో విజయ్ ఎక్కడా అన్నాడీఎంకేను గానీ, ఎడప్పాడి పళనిస్వామి (EPS) ని గానీ తీవ్రంగా విమర్శించలేదు. ఇది భవిష్యత్తు పొత్తుకు సంకేతమే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్, వామపక్షాల ఆసరా.. పీఎంకే (PMK) కింగ్ మేకర్..!
ఒకవేళ అన్నాడీఎంకే మద్దతు ఇవ్వకపోతే, డీఎంకే కూటమిలోని పార్టీలను లాగడం విజయ్ కి ఉన్న మరో ప్రత్యామ్నాయం.
- విజయ్ తండ్రి ఇప్పటికే కాంగ్రెస్ కు ఆఫర్ ఇచ్చారు, రాహుల్ గాంధీ స్వయంగా విజయ్ తో ఫోన్లో మాట్లాడారు.
- డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ (5), CPI (2), IUML (2) సీట్లు TVK వైపు వస్తే అప్పుడు బలం 117 (108+5+2+2) కు చేరుతుంది.
- అయినా సరే మెజారిటీకి ఇంకా 1 సీటు తక్కువ పడుతుంది.
- సరిగ్గా ఇక్కడే అన్బుమణి రామదాస్ నాయకత్వంలోని PMK పార్టీ కింగ్ మేకర్ కానుంది. వారికున్న 4 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తే, TVK బలం 121 కి చేరుకుని విజయ్ సునాయాసంగా సీఎం అవుతారు.
బద్ధ శత్రువులు ఏకమైతే దళపతికి చెక్..?
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. విజయ్ ముఖ్యమంత్రి కాకుండా ఆపడానికి డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రమాదం కూడా లేకపోలేదు. ఒకవేళ DMK (59) + AIADMK (47) = 106 సీట్లతో కూటమి కడితే సమీకరణాలు మారిపోతాయి. సిద్ధాంతపరంగా ఈ రెండు పార్టీలు కలవడం అసాధ్యం అనిపించవచ్చు. కానీ అధికారం కోసం నితీష్ కుమార్-లాలూ ప్రసాద్ యాదవ్ (బీహార్), సమాజ్ వాదీ-బహుజన్ సమాజ్ పార్టీ (యూపీ), శివసేన-కాంగ్రెస్ (మహారాష్ట్ర) ఎలా కలిశాయో మనం చూశాం. విజయ్ ని నిలువరించడానికి ద్రావిడ పార్టీలు ఒకటైతే, అది తమిళనాట చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ సంచలనం అవుతుంది.
విజయ్ అన్నాడీఎంకే తో వెళ్తారా..? లేక చిన్న పార్టీలను కలుపుకుని మ్యాజిక్ ఫిగర్ దాటుతారా..? విజయ్ వెనుక ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (PK) ఉన్నారు కాబట్టి, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని స్థిరమైన ప్రభుత్వం కోసం పక్కా ప్రణాళికతోనే అడుగులు వేస్తారు అనడంలో సందేహం లేదు. ఎన్నికల యుద్ధం ముగిసింది, కానీ సింహాసనం కోసం అసలు పోరాటం ఇప్పుడే మొదలైంది. దళపతి ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతాడా లేదా అన్నది రాబోయే కొద్ది రోజుల్లో తేలిపోనుంది.
