HomeCrime Newsట్రేడింగ్, ఉద్యోగాల పేరిట ఘరానా మోసం: రూ.1.70 కోట్లు స్వాహా

ట్రేడింగ్, ఉద్యోగాల పేరిట ఘరానా మోసం: రూ.1.70 కోట్లు స్వాహా

• నిందితుడు విద్యుత్ శాఖ ఏఈ..

నిందితుడి అరెస్ట్, రిమాండ్ కు తరలించిన పోలీసులు 

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని, అలాగే కూతురికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఏకంగా రూ.1.70 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఓ ప్రభుత్వ అధికారి కటకటాలపాలయ్యాడు. నిందితుడు విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) గా బాధ్యతాయుతమైన పదవిలో ఉండటం గమనార్హం. ఆదిలాబాద్ టూ టౌన్ సీఐ కె. నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నిజామాబాద్‌కు చెందిన గుడూరు ఉమారాణి(45) ప్రైవేట్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమెకు 2014లో సల్మాన్ అలియాస్ సోలోమన్ రాజ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాను విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేస్తున్నానని ఆమెకు పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో 2018లో తన వ్యక్తిగత అవసరాల కోసం ఉమారాణి వద్ద రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్న సల్మాన్, కొద్దిరోజుల తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేసి ఆమెకు బాగా నమ్మకం కలిగించాడు.

ఆ తర్వాత 2022లో అసలు ప్లాన్ అమలు చేశాడు. ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని ఉమారాణిని నమ్మించాడు. ఆమె పేరుతో ఓ ఖాతా తెరిపించాడు. అతడి మాటలు నమ్మిన ఉమారాణి.. తన బంధువులు, పరిచయస్తుల వద్ద సుమారు రూ.1.40 కోట్లు అప్పుగా తీసుకొని సల్మాన్‌కు ఇచ్చింది. అంతేకాకుండా, తన కుమార్తెకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలకడంతో మరో రూ.30 లక్షలు అతడి చేతిలో పెట్టింది. ఇలా మొత్తం రూ.1.70 కోట్లను విడతల వారీగా ఆన్‌లైన్ ద్వారా, అలాగే ఆదిలాబాద్ విద్యానగర్‌లోని అతడి కార్యాలయంలో నగదు రూపంలో చెల్లించింది.

నెలలు గడుస్తున్నా అటు ట్రేడింగ్ లాభాలు రాక, ఇటు కూతురికి ఉద్యోగం రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. సల్మాన్‌ను నిలదీసింది. అతడు సరైన సమాధానం ఇవ్వకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతుండటంతో.. ఈ నెల 2వ తేదీన ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టి సోమవారం నిందితుడు సల్మాన్‌ను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ నాగరాజు తెలిపారు.

బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఇలాంటి మోసాలకు పాల్పడటం పట్ల స్థానికంగా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా టూ టౌన్ సీఐ నాగరాజు మాట్లాడుతూ.. కష్టపడకుండా డబ్బులు ఊరికే రావని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ట్రేడింగ్, ఆన్‌లైన్ పెట్టుబడులు, ఉద్యోగాల పేరిట మాయమాటలు చెప్పే మోసగాళ్ల వలలో పడి కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని ఆయన ప్రజలను అప్రమత్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular