Friday, May 8, 2026
HomeBreaking Newsనన్ను అన్న అనకు.. సార్ అను..! - పోలీసులను అన్న అని పిలిస్తే తప్పా..?

నన్ను అన్న అనకు.. సార్ అను..! – పోలీసులను అన్న అని పిలిస్తే తప్పా..?

ప్రశ్నార్థకంగా మారుతున్న ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ తీరు!

• నేనేమైనా ఓట్లు అడుగుతున్నానా..? – నిజామాబాద్ 2 టౌన్ ఎస్సై వీడియో వైరల్.

• కరీంనగర్‌లో ‘అన్న’ అన్నందుకు సెలూన్ నిర్వాహకుడిపై దాడి చేసిన ఘటన మరవక ముందే మరో ఇష్యూ.

 • తెలుగు నాట ‘అన్న’ అనే పిలుపు గౌరవానికి ప్రతీకా..? లేక అవమానమా..?

• ప్రజా సేవకులు ‘సార్’ అని పిలిపించుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి.?

వాస్తవ నేస్తం,స్పెషల్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో పౌరులకు, పోలీసులకు మధ్య దూరం తగ్గించి, స్నేహపూర్వక వాతావరణం తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో పోలీస్ శాఖ ఎప్పటినుంచో ఫ్రెండ్లీ పోలీసింగ్ (Friendly Policing) విధానాన్ని అమలు చేస్తోంది. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ ఎందరో పోలీసులు ప్రజల మన్ననలు పొందుతున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల వ్యవహారశైలి మాత్రం ఈ ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ కే మచ్చ తెచ్చేలా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పోలీసులను పౌరులు ఏమని సంబోధించాలి? అన్న విషయంపై తాజాగా జరుగుతున్న రచ్చ సామాన్యులను తీవ్రంగా ఆలోచింపజేస్తోంది.

నేనేమైనా ఓట్లు అడుగుతున్నానా..?

తాజాగా నెట్టింట నిజామాబాద్ 2 టౌన్ ఎస్సైకి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. ఒక సాధారణ పౌరుడు ఎస్సైతో మాట్లాడుతూ “అన్నా..” అని సంబోధించాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆ అధికారి, “నన్ను అన్న అనకు.. సార్ అను. నేను నీ దగ్గర ఏమైనా ఓట్లు అడుగుతున్నానా..?” అంటూ మండిపడ్డారు. ఓట్లు అడిగే రాజకీయ నాయకులను మాత్రమే ‘అన్న’ అని పిలవాలని, పోలీసులను ‘సార్’ అని మాత్రమే అనాలన్న ఆయన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పోలీసులను ‘అన్న’ అని పిలిచినందుకు సామాన్యులు అధికారుల ఆగ్రహానికి గురవ్వడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల కరీంనగర్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ సెలూన్ నిర్వాహకుడు అక్కడి ఎస్సైని ‘అన్న’ అని పిలిచిన పాపానికి, ఆ అధికారి ఏకంగా సదరు యువకుడిపై భౌతిక దాడికి దిగిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఆ వివాదం ఇంకా చల్లారకముందే, ఇప్పుడు నిజామాబాద్ ఎస్సై వీడియో వెలుగులోకి రావడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.

అన్న అంటే అవమానమా..? ‘సార్’ అంటేనే గౌరవమా..?

తెలుగు రాష్ట్రాల సంస్కృతిలో ‘అన్న’ అనే పదానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అది కేవలం ఒక పిలుపు కాదు.. అందులో గౌరవం, ఆత్మీయత, భరోసా దాగి ఉంటాయి. ఒక సామాన్యుడు పోలీసు స్టేషన్‌కు వెళ్లినప్పుడు తన సమస్యను చెప్పుకునే క్రమంలో, ఎదురుగా ఉన్న అధికారిని తన సొంత మనిషిగా భావించి పిలిచే మొదటి పిలుపు “అన్నా”. ఒకప్పుడు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్ లాంటి అగ్ర నాయకులను కూడా ప్రజలు “అన్నా”, “సార్” అని రెండు విధాలుగా పిలిచేవారు.

అలాంటప్పుడు ప్రజా రక్షణ కోసం, ప్రజా సేవ కోసం ఉన్న పోలీస్ అధికారులను ‘అన్న’ అని పిలిస్తే అందులో తప్పేముంది? అన్నది సామాన్యుల ప్రశ్న. ‘సార్’ (Sir) అనేది బ్రిటిష్ వలసవాద కాలం నాటి పదం. అది అధికారానికి, భయానికి ప్రతీకగా మిగిలిపోయింది. వలసవాద మూలాలున్న చట్టాలనే దేశవ్యాప్తంగా మార్చుకుంటున్న ఈ రోజుల్లో, పౌరులు తమను ‘సార్’ అని, ‘దొర’ అని పిలవాలని ప్రజా సేవకులు (Public Servants) ఆశించడం ఎంతవరకు సమంజసం? అన్న చర్చ మేధావుల్లోనూ జరుగుతోంది.

ఖచ్చితంగా పోలీస్ ఉద్యోగం అనేది ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. లా అండ్ ఆర్డర్ కాపాడే క్రమంలో వారు కఠినంగా వ్యవహరించాల్సి రావచ్చు. కానీ, ఒక పౌరుడు ఏ ఉద్దేశ్యంతో, ఎంతటి గౌరవంతో ‘అన్న’ అని పిలుస్తున్నాడో అర్థం చేసుకోకుండా, కేవలం ఆ పిలుపుపైనే ఆగ్రహం వ్యక్తం చేయడం వృత్తిపరమైన హుందాతనానికి నిదర్శనం కాదని సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. నిజమైన గౌరవం భయపెట్టి ‘సార్’ అని పిలిపించుకోవడంలో రాదు.. ప్రజల పట్ల వారు చూపే జవాబుదారీతనం, చేసే సేవ ద్వారా వస్తుంది. ఈ ‘సార్ – అన్న’ వివాదాల వల్ల పోలీసులకు, ప్రజలకు మధ్య తిరిగి కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారులు ఇలాంటి సున్నితమైన అంశాలపై కింది స్థాయి సిబ్బందికి తగిన అవగాహన (సెన్సిటైజేషన్) కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

By.. QAMAR

RELATED ARTICLES
- Advertisment -

Most Popular