• ద్రవిడ పార్టీల కుమ్మక్కుపై గురి… 107 మంది టీవీకే ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామా అస్త్రం?!
• అధికార దాహంతో ఏకమవుతున్న బద్ధ శత్రువులు.?
• ఎన్డీటీవీ కథనంతో రాజకీయ వర్గాల్లో కలకలం
వాస్తవ నేస్తం,స్పెషల్ డెస్క్ : దశాబ్దాలుగా రెండు ద్రవిడ పార్టీల కనుసన్నల్లో నడుస్తున్న తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు సమూలంగా మారబోతోందా.? అధికారం కోసం బద్ధ శత్రువులు సైతం సిద్ధాంతాలను పక్కనబెట్టి చేతులు కలుపుతున్నారా.? ఈ అవకాశవాద రాజకీయాలకు చెక్ పెట్టేందుకు ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ బ్రహ్మాస్త్రాన్ని సంధించబోతున్నారా.? అంటే తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.
టీవీకే పార్టీకి చెందిన ఏకంగా 107 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు జాతీయ మీడియా ఎన్డీటీవీ సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. ఈ వార్త ఇప్పుడు జాతీయ స్థాయిలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
అసలేం జరుగుతోంది..? ఎందుకీ అనుమానాలు..?
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రధాన పార్టీలైన డీఎంకే (DMK), అన్నాడీఎంకే (AIADMK)లు లోపాయికారీ ఒప్పందానికి వచ్చాయన్న బలమైన అనుమానాన్ని టీవీకే వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ఈ రెండు పార్టీలు వేర్వేరుగా నిర్వహించిన అంతర్గత సమావేశాలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి. టీవీకేను అధికారానికి దూరం చేయడానికి, ఒకరికొకరు బద్ధ శత్రువులుగా వ్యవహరించే డీఎంకే, అన్నాడీఎంకేలు తెరవెనుక కుమ్మక్కై ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని దళపతి విజయ్ వర్గం భావిస్తోంది.
ఒకవేళ డీఎంకే లేదా అన్నాడీఎంకేలలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినా… దాన్ని నిరసిస్తూ తమ పార్టీకి చెందిన 107 మంది ఎమ్మెల్యేలతో ఒకేసారి స్పీకర్‌కు రాజీనామాలు సమర్పించాలని టీవీకే అధిష్టానం ఒక సంచలన నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ప్రజాస్వామ్యమా..? అవకాశవాదమా..?
విజయ్ తీసుకోబోతున్న ఈ నిర్ణయం ఇప్పుడు తమిళనాట మేధావి వర్గాలను, సామాన్య ప్రజలను తీవ్రంగా ఆలోచింపజేస్తోంది.
ఉప్పు, నిప్పులా ఉండే రెండు పార్టీలు కేవలం పదవుల కోసం ఏకమైతే, దశాబ్దాలుగా ఆయా పార్టీలు వల్లెవేసిన సిద్ధాంతాలకు విలువెక్కడ.?
ఒకేసారి 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, ఏర్పడే ప్రభుత్వానికి నైతిక హక్కు ఉంటుందా? అసలు ఆ సభ మనగలుగుతుందా.?
ద్రవిడ పార్టీల అవకాశవాద రాజకీయాలను, వారి ద్వంద్వ వైఖరిని ప్రజల ముందు నగ్నంగా నిలబెట్టడానికే విజయ్ ఈ సాహసోపేతమైన అడుగు వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మూకుమ్మడి రాజీనామాల ద్వారా రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం సృష్టించి, తద్వారా పాత రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెప్పించాలన్నది టీవీకే వ్యూహంగా కనిపిస్తోంది.
ఈ రాజీనామా అస్త్రం నిజంగా ప్రయోగిస్తే… అది కేవలం తమిళనాడుకే కాదు, దేశ రాజకీయ చరిత్రలోనే ఒక కనీవినీ ఎరుగని ఘట్టంగా మిగిలిపోతుంది. విజయ్ ఎత్తుగడ ద్రవిడ పార్టీల కోటలు బద్దలు కొడుతుందా. ? లేక రాష్ట్రంలో అనిశ్చితికి దారితీస్తుందా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.
