📄 ePaper
Thursday, May 21, 2026
📄 ePaper
HomeBreaking Newsస్మశాన వాటికకు సొంత పేరు.. రూ.1.30 కోట్లకు లెక్కేది..?

స్మశాన వాటికకు సొంత పేరు.. రూ.1.30 కోట్లకు లెక్కేది..?

• ముఖ్ర (కే)లో మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీల పై సంచలన ఆరోపణలు చేసిన నూతన సర్పంచ్, పాలకవర్గం

వాస్తవ నేస్తం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్ర (కే) గ్రామ పంచాయతీలో రాజకీయ దుమారం రేగింది. గతంలో గ్రామాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని, కుటుంబ పాలన సాగించిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీల అవినీతి, అక్రమాల చిట్టాను నూతన పాలకవర్గం రచ్చకెక్కింది. సర్పంచ్, ఎంపీటీసీ పదవులను ఒకే కుటుంబం ఏలడమే కాకుండా.. గ్రామంలో నియంతృత్వ పాలన సాగించారని ఆరోపిస్తూ ముఖ్ర (కే) నూతన సర్పంచ్ గాయక్వాడ్ శ్రీపాల్, ఉప సర్పంచ్ పవార్ బాలాజీ, మరియు వార్డు సభ్యులు సంయుక్తంగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

రూ. 1 కోటి 30 లక్షల వీడీసీ (VDC) నిధులు ఏమయ్యాయి..?

గతంలో గాడ్గె మీనాక్షి సర్పంచ్‌గా ఉన్న సమయంలో, ఆమె భర్త, అప్పటి ఎంపీటీసీ గాడ్గె సుభాష్ వీడీసీ (గ్రామ అభివృద్ధి కమిటీ) వ్యవహారాల్లో చక్రం తిప్పారని ఆరోపించారు. వీడీసీ పేరుతో వసూలైన సుమారు రూ. 1 కోటి 30 లక్షల (1.30 కోట్లు) భారీ నగదుకు ఎలాంటి లెక్కలు చూపలేదని కొత్త పాలకవర్గం ఆరోపిస్తోంది. ఆ నిధుల గురించి గ్రామస్తులు ప్రశ్నిస్తే సమాధానం దాటవేయడంతో పాటు, బెదిరింపులకు పాల్పడేవారని మండిపడ్డారు.

ప్రభుత్వ స్మశానవాటికకు సొంత పేరు..

ప్రభుత్వ స్థలంలో, పంచాయతీ నిధులతో నిర్మించిన స్మశాన వాటికను (వైకుంఠధామం) మాజీ సర్పంచ్ కుటుంబం తమ సొంత ఆస్తిలా వాడుకున్నట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ స్మశాన వాటికకు వారి కుటుంబ సభ్యురాలైన వారి పేరు పెట్టుకోవడమే కాకుండా.. ఆ స్థలంలో వేరే ఏ గ్రామస్తుల శవాన్ని కాల్చనివ్వకుండా, అంత్యక్రియలు జరగనివ్వకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను తమ ఇంటి ఆవరణలా, మరుగుదొడ్ల స్థలంలా వాడుకున్నారని పత్రికా ప్రకటనలో విమర్శించారు.

ప్రశ్నించే వారిని గొంతులను నొక్కేయడానికి మాజీ సర్పంచ్, ఎంపీటీసీ దంపతులు కులాలను పావులుగా వాడుకున్నారని కొత్త పాలకవర్గం ఆరోపించింది. ఎస్సీ, బీసీ వర్గాలను రాజకీయంగా తమ స్వార్థానికి వాడుకుంటూ.. వారిని ముందుపెట్టి గ్రామంలో గొడవలు సృష్టించేవారని పేర్కొన్నారు. ఎవరైనా తమ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తదితర అక్రమ కేసులు బనాయించేవారని ఆరోపించారు.

ఒకరే సర్పంచ్, మరొకరు ఎంపీటీసీ.. ఇలా పెత్తనం అంతా తమదే అన్నట్లుగా సాగిన గాడ్గె కుటుంబ నియంతృత్వానికి విసిగిపోయిన ప్రజలు.. ఈ ఎన్నికల్లో ఏకమై తమను (గాయక్వాడ్ శ్రీపాల్‌ను) సర్పంచ్‌గా గెలిపించారని వారు స్పష్టం చేశారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular