• పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేదాంత్ మౌర్య ఫైర్
• తెలంగాణ అంటే నాలుగున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవమని స్పష్టీకరణ
వాస్తవ నేస్తం,హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ఉద్యమంపై చేసిన వ్యాఖ్యలపై సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (SSF) రాష్ట్ర అధ్యక్షుడు వేదాంత్ మౌర్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మొహానికి రంగు వేసుకుని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే నాయకులు కాలేరని ఆయన తీవ్రంగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లో బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ గడ్డ ఎవరి భిక్షా కాదని, ఇది తమ జాగీరని వేదాంత్ మౌర్య స్పష్టం చేశారు. “ఈ గడ్డ నిన్న మా అయ్యల జాగీరే.. ఈరోజు మా జాగీరు.. రేపు మా బిడ్డల జాగీరు. ఇక్కడి హక్కులను ఎవరూ శాసించలేరు,” అని ఆయన తేల్చి చెప్పారు. ఎవరో పైసలు పంచితేనో, ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తేనో తెలంగాణ రాష్ట్రం సిద్ధించలేదని, ఇది కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవ పోరాటమని ఆయన గుర్తుచేశారు.
త్యాగాల పునాదులపైనే తెలంగాణ..
తెలంగాణ సాధన కోసం ఎంతోమంది యువకులు, విద్యార్థులు తమ ప్రాణాలను బలిదానం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలనలో ‘తెలంగాణ’ అని నోరెత్తితే ఎన్‌కౌంటర్ల పేరుతో అణచివేశారని, ఎంతోమంది తల్లులు గర్భశోకం అనుభవించారని ఆయన అన్నారు. ఇన్ని వేల త్యాగాల పునాదుల మీదే నేటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని స్పష్టం చేశారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినా పరాయి ప్రాంతం వారిని ఒక్క మాట కూడా అనకుండా అహింసా మార్గంలో తాము పోరాడామని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
పవన్ కళ్యాణ్‌ను కేవలం ఒక నటుడిగా మాత్రమే జనం అభిమానిస్తారని, తెలంగాణ రాజకీయాల్లో ఆయన మాటలకు ఎలాంటి విలువా లేదని ఎద్దేవా చేశారు. ఎవరో వెనక ఉండి రాసిచ్చిన స్క్రిప్ట్‌ను స్టేజీలపై చదివితే నటుడు అంటారు తప్ప, ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు అనరు.. ఆ విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలి, అని చురకలంటించారు. తెలంగాణ అంటే కేవలం ఒక ప్రాంతం కాదని, అది నాలుగున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని.. ఇక్కడి చరిత్రను, త్యాగాలను తక్కువ చేసి మాట్లాడితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని వేదాంత్ మౌర్య తీవ్రంగా హెచ్చరించారు.
