HomeAndhra PradeshJanasena party Pawan Kalyan | పవన్ 'సంకల్ప సభ'కు బ్రేక్..!

Janasena party Pawan Kalyan | పవన్ ‘సంకల్ప సభ’కు బ్రేక్..!

• హైదరాబాద్‌లో జనసేనాని సభకు అనుమతి నిరాకరించిన ప్రభుత్వం

• ఏర్పాట్లలో నిమగ్నమైన జనసేన శ్రేణులకు షాక్

• అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించనున్న పార్టీ నేతలు

వాస్తవ నేస్తం,హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు బ్రేక్ పడింది. రేపు (జూన్ 2) గచ్చిబౌలిలో జరగాల్సిన ‘తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ’కు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ అనుమతి నిరాకరించాయి. సభ కోసం జనసేన తెలంగాణ విభాగం ఇప్పటికే ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ప్రభుత్వ నిర్ణయం ఆ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సభకు ఎలాగైనా అనుమతి సాధించేందుకు జనసేన నాయకత్వం న్యాయపోరాటానికి సిద్ధమైంది. పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తక్షణమే హైకోర్టును ఆశ్రయించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అనుమతి నిరాకరణ వెనుక ప్రధాన కారణాలివేనా..?

పవన్ కళ్యాణ్ సభకు ప్రభుత్వం ఉన్నపళంగా అనుమతి నిరాకరించడం వెనుక పలు భద్రతా, రాజకీయ కారణాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రేపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ వేడుకల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అంతా బందోబస్తు విధుల్లో నిమగ్నమై ఉంటుంది. ఇంతటి భారీ స్థాయిలో సిబ్బంది కొరత ఉన్న సమయంలో పవన్ సభకు భద్రత కల్పించడం అసాధ్యమని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

ఇటీవల పవన్ కళ్యాణ్, ప్రొఫెసర్ నాగేశ్వర్ మధ్య చోటుచేసుకున్న వివాదంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కాస్త వేడెక్కింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ సభ నిర్వహిస్తే, ఆందోళనకారులు అడ్డుకునే ప్రమాదం ఉందని, భారీగా భద్రత కల్పించాల్సి వస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా.? గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన నాయకుడిగా పవన్ కళ్యాణ్‌పై ఒక ముద్ర ఉంది. సరిగ్గా తెలంగాణ ప్రజలు పండుగలా జరుపుకునే రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడే ఆయన ఇక్కడ సభ నిర్వహించడం… ఒక వర్గం ప్రజల మనోభావాలను, సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే చర్యగా కొందరు భావిస్తున్నారు.

ఈ ప్రత్యేక పరిస్థితులు, లా అండ్ ఆర్డర్ సమస్యల దృష్ట్యా ప్రస్తుత తరుణంలో పవన్ సభకు అనుమతి ఇవ్వడం శ్రేయస్కరం కాదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పుడు అందరి దృష్టి హైకోర్టు తీర్పుపైనే నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular