HomeDevotional Newsఘనంగా ముగిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పీఠం పూజలు

ఘనంగా ముగిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పీఠం పూజలు

* మంగళ వాయిద్యాలు, చీరలు, సారెతో అమ్మవారికి వీడ్కోలు
* ఇచ్చోడలో భక్తిశ్రద్ధలతో వారం రోజుల వేడుకలు

వాస్తవ నేస్తం,ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో గత వారం రోజులుగా వైభవంగా జరుగుతున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పీఠం ప్రత్యేక పూజలు ఆదివారం భక్తిశ్రద్ధల నడుమ ముగిశాయి. స్థానిక హనుమాన్ సాయి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఈ వేడుకలను అత్యంత భక్తిప్రపత్తులతో నిర్వహించారు. ముగింపు వేడుకల్లో భాగంగా పీఠంపై ప్రతిష్ఠించిన అమ్మవారిని మహిళలు తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఘనంగా సాగనంపారు. మంగళ వాయిద్యాల నడుమ, హారతులు ఇచ్చి.. చీరలు, సారెలు, కట్నకానుకలు సమర్పించి భక్తిపూర్వకంగా వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా పూజారి బుక్క శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతి ఐదేళ్లకోసారి వాసవి కన్యకా పరమేశ్వరి పీఠాన్ని రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలు, గ్రామాలకు తీసుకెళ్లడం ఆనవాయితీ అని తెలిపారు. ఆ సమయంలో వారం రోజుల పాటు స్థానిక మహిళలచే దీప, ధూప, నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించడం సంప్రదాయమని వివరించారు. దేశ ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, సమాజంలో ఐక్యత, శ్రేయస్సు నెలకొనాలన్నదే ఈ పూజల ప్రధాన ఆకాంక్ష అని అన్నారు. ముగింపు రోజున అమ్మవారిని కుటుంబంలోని ఆడపడుచుగా భావించి చీరలు, సారెలు, కానుకలతో వీడ్కోలు పలకడం వైశ్య సమాజం తరతరాలుగా పాటిస్తున్న ఆచారమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గంగిశెట్టి సంతోష్, ఉపాధ్యక్షుడు ఉత్తర్వార్ రాజేందర్, గౌరవాధ్యక్షుడు రాయిపల్లి సంతోష్ పాల్గొన్నారు. అలాగే సంఘం నాయకులు, సభ్యులు పత్తివార్ మహేష్, కత్తురి సంజీవ్, కృష్ణకుమార్, సతీష్, ముక్క శ్రీనివాస్, సురేష్, కౌటిక్‌వార్ మహేష్, డికొండ మహేష్, నరేష్, గందే శ్రీధర్, బచ్చువార్ రాజేష్‌తో పాటు పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య సంఘం మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular