వాస్తవ నేస్తం,ఇచ్చోడ: ముస్లిం సమాజంలో విద్యాభివృద్ధి, సామాజిక చైతన్యం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని ప్రముఖ సామాజిక కార్యకర్త ముబారక్ పిలుపునిచ్చారు. సమాజంలో ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదని, మసీదు కమిటీలు, స్థానిక నాయకులు, పెద్దలు సమన్వయంతో పని చేసి కమ్యూనిటీలో అవగాహన తీసుకురావాలని ఆయన ఒక పత్రికా ప్రకటనలో కోరారు. ప్రస్తుతం జరుగుతున్న ఎస్.ఐ.ఆర్ (S.I.R) నమోదు ప్రక్రియను ఏ పరిస్థితిలోనైనా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో స్థానికంగా ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే వారి సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జాబితాలో ఏ ఒక్కరి పేరు కూడా మిస్ కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. విద్యే అందరి హక్కు
విద్య ప్రతి ఒక్కరి హక్కు అని, మన ప్రాంతంలో ఏ ఒక్క బిడ్డ కూడా బడికి వెళ్లకుండా ఉండకూడదని ముబారక్ ఉద్ఘాటించారు. 18 ఏళ్ల లోపు పిల్లలు దుకాణాల్లో కానీ, మరెక్కడైనా కానీ పని చేస్తుంటే వెంటనే వారిని పనుల్లోంచి మాన్పించి పాఠశాలలకు పంపాలని విజ్ఞప్తి చేశారు. విద్య ద్వారానే మనుషుల ఆలోచనా విధానంలో మార్పు, సామాజిక అవగాహన వస్తాయని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం టెన్త్ (10th Open) ఓపెన్ అడ్మిషన్లు కొనసాగుతున్నాయని, ఈ అవకాశాన్ని చదువు మధ్యలో ఆపేసిన వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సమాచారాన్ని ప్రతి ఇంటికీ చేరవేసేందుకు స్థానిక మసీదుల ద్వారా విస్తృతంగా ప్రకటనలు చేయాలని మసీదు కమిటీలను అభ్యర్థించారు. ప్రతి బిడ్డ చదువుకోవాలని, ప్రతి ఇంటా విజ్ఞాన జ్యోతులు వెలగాలన్నదే తన ఏకైక లక్ష్యమని ముబారక్ స్పష్టం చేశారు.
