• సాటి మనిషిని ఆదుకోవాలని సామాజిక కార్యకర్త ముబారక్ పిలుపు
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: మానవత్వానికి మతం అడ్డురాదని, సాటి మనిషి కష్టాల్లో ఉంటే ఆదుకోవడమే నిజమైన సేవా ధర్మమని ‘ఆల్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ’ నిరూపించింది. ఆదరణ కరువై, దయనీయ స్థితిలో ఉన్న ఓ అభాగ్యుడికి వారు అండగా నిలిచి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే… ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో రాజు అనే వ్యక్తి మానసిక స్థితి సరిగా లేక, ఎలాంటి ఆధారం లేకుండా అనాథలా రోడ్లపై కాలం వెళ్లదీస్తున్నాడు. కనీసం స్నానం కూడా చేయని పరిస్థితుల్లో ఒళ్లంతా మురికిపట్టి అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఎవరైనా దగ్గరికి వెళ్లాలన్నా జంకే పరిస్థితి. అలాగే అతడు కూడా ఎవరినీ తన దరిదాపుల్లోకి రానివ్వని స్థితిలో ఉన్నాడు.
ఈ విషయాన్ని గమనించిన ‘ఆల్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ’కి చెందిన సామాజిక కార్యకర్త ముబారక్, తన బృందంతో కలిసి ముందుకు వచ్చారు. ఆ అభాగ్యుడిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. అతనికి క్షవరం చేయించి, స్నానం చేయించి శుభ్రం చేశారు. అనంతరం కొత్త బట్టలు తొడిగి, మళ్లీ సమాజంలో అతనికి ఓ గౌరవప్రదమైన రూపాన్ని తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త ముబారక్ మాట్లాడుతూ.. మంచి పనులు చేయడానికి మతం చూడాల్సిన అవసరం లేదు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సహాయం చేయడమే మన లక్ష్యం కావాలి. నేడు ఒక అభాగ్యుడికి సేవ చేసి, తిరిగి అతన్ని గౌరవప్రదంగా ప్రజల మధ్యకు తీసుకురావడం మాకు ఎంతో సంతోషాన్ని, ఆత్మసంతృప్తిని ఇచ్చింది అని అన్నారు. ప్రతి ప్రాంతంలోనూ యువత, స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ చిన్న ప్రయత్నం ద్వారా సమాజంలో మానవత్వంపై అందరికీ అవగాహన కల్పించాలనేదే తమ ఆశయమని ముబారక్ స్పష్టం చేశారు. మతం కన్నా మానవత్వం మిన్న అని చాటిచెప్పిన ఆల్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ సభ్యులను పలువురు స్థానికులు అభినందించారు.

