HomeCrime Newsమహిళపై సీఐ కీచకం.. జూబ్లీహిల్స్ ఇన్స్‌పెక్టర్ సస్పెండ్

మహిళపై సీఐ కీచకం.. జూబ్లీహిల్స్ ఇన్స్‌పెక్టర్ సస్పెండ్

 * ఉత్తర్వులు జారీ చేసిన పోలీస్ కమిషనర్ సజ్జనార్

 * ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై లైంగిక దాడి

 * ఏకాంత వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసి డబ్బుల వసూలు

 * వెలుగులోకి వచ్చిన పోలీసు అధికారి బాగోతం

 

వాస్తవ నేస్తం హైదరాబాద్ సిటీ బ్యూరో : రక్షక భటుడే భక్షకుడిగా మారాడు. న్యాయం చేయాల్సిన ఓ పోలీసు అధికారే బాధితురాలి పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళను లోబరుచుకుని, శారీరకంగా వాడుకోవడమే కాకుండా.. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజిన వ్యవహారంలో జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఈ వ్యవహారంపై జరిపిన విచారణలో ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఆయన్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. కొంతకాలం క్రితం ఓ సమస్యపై ఫిర్యాదు చేసేందుకు ఓ మహిళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. అప్పట్లో ఆమె పరిస్థితిని ఆసరాగా చేసుకున్న ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి, ఆమెకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. అనంతరం ఆమెను శారీరకంగా వాడుకున్నట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. ఈ క్రమంలోనే సీఐ శ్రీనివాసులు రెడ్డి, ఆ మహిళ కొన్ని రోజుల పాటు ఒకే ఇంట్లో కలిసి ఉన్నట్లు సమాచారం.

వీడియోలతో బ్లాక్ మెయిల్..

సదరు మహిళను వాడుకోవడమే కాకుండా, ఆమెతో చనువుగా ఉన్న సమయంలో రహస్యంగా వీడియోలు చిత్రీకరించిన సీఐ.. వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఈ ఏకాంత వీడియోలను బయటపెడతానని బెదిరింపులకు పాల్పడి, బాధితురాలి నుంచి భారీగా డబ్బులు లాగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆమె నుంచి పెద్ద ఎత్తున డబ్బులు గుంజిన తర్వాత, సదరు మహిళను వదిలించుకునేందుకు సీఐ శ్రీనివాసులు రెడ్డి విశ్వప్రయత్నాలు చేశాడు. ఆమెను బెదిరించడం, దూరం పెట్టడం వంటి చర్యలకు పాల్పడ్డాడు. సీఐ మోసాన్ని గ్రహించిన బాధితురాలు నేరుగా ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో ఈ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు, రహస్యంగా దర్యాప్తు చేసి సీఐ తీరును నిర్ధారించారు. దీంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా కమీషనర్ సజ్జనార్ అతడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటన నగర పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular