HomeCrime Newsహైదరాబాద్‌లో భారీ కల్తీ నెయ్యి రాకెట్ గుట్టురట్టు : 36 టన్నుల నకిలీ సరుకు సీజ్

హైదరాబాద్‌లో భారీ కల్తీ నెయ్యి రాకెట్ గుట్టురట్టు : 36 టన్నుల నకిలీ సరుకు సీజ్

• ఒకేసారి 130 కేంద్రాల్లో టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు

• పాలు లేకుండానే పామ్ ఆయిల్, రసాయనాలతో తయారు చేస్తున్న ముఠా

• హోటళ్లు, స్వీట్ షాపులు, పూజా సామగ్రి పేరిట మార్కెట్లోకి విక్రయాలు

 

వాస్తవ నేస్తం,హైదరాబాద్ : రాజధాని నగరంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న భారీ కల్తీ నెయ్యి ముఠా ఆటను హైదరాబాద్ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ , ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు సంయుక్తంగా కట్టడి చేశారు. మంగళవారం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 130 ప్రాంగణాల్లో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, సుమారు 36 టన్నుల కల్తీ నెయ్యి, ప్రమాదకర రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న సరుకులో 25.5 టన్నుల కల్తీ నెయ్యి, 8.7 టన్నుల క్రీమ్, 1,200 లీటర్ల పామ్ ఆయిల్, 600 లీటర్ల వనస్పతి (డాల్డా), 30 కేజీల స్టార్చ్‌తో పాటు కృత్రిమ సువాసన ద్రవాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కల్తీ ముఠా అత్యంత ప్రమాదకర రీతిలో నకిలీ నెయ్యిని తయారు చేస్తున్నట్లు దాడుల్లో బట్టబయలైంది. స్కిమ్డ్ మిల్క్ పౌడర్, పామ్ ఆయిల్, డాల్డా, స్టార్చ్, హానికర రసాయనాలను మిశ్రమం చేసి అసలు పాలే వాడకుండా నెయ్యిని సృష్టిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి నాసిరకం ముడి సరుకును తెప్పించి తక్కువ ఖర్చుతో తయారు చేస్తున్నారు. ల్యాబ్ పరీక్షల్లోనూ చిక్కకుండా ఉండేందుకు బీటా-కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ లాంటి రసాయనాలు కలుపుతున్నారు. అనంతరం ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి, ఎలాంటి అనుమతులు, బ్యాచ్ నంబర్లు లేకుండా 100% ప్యూర్ నెయ్యి , ఫార్మ్ ఫ్రెష్ నెయ్యి” వంటి ఆకర్షణీయమైన పేర్లతో హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ దుకాణాలు, ఆయుర్వేద షాపులు, పూజా సామగ్రి దుకాణాలకు గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నారు.

📲 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో చేరండి!

👉 జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్

తీవ్ర అనారోగ్య ముప్పు – పోలీసుల హెచ్చరిక..

ఈ కల్తీ నెయ్యి వాడకం వల్ల శరీరంలో బాడ్ కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదముందని, లివర్, కిడ్నీలు తీవ్రంగా దెబ్బతింటాయని అధికారులు హెచ్చరించారు. కల్తీ ఆహార విక్రేతలపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ హెచ్చరించారు. మార్కెట్లో గుర్తింపు ఉన్న నాణ్యమైన సీల్డ్ ప్యాకెట్లను మాత్రమే కొనుగోలు చేయాలని, తక్కువ ధరకు వచ్చే విడి నెయ్యిని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వస్తే డయల్ 112 హెల్ప్‌లైన్ నంబర్ 8712661212 కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టంచేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular