• రోడ్డు రోలర్‌తో 121 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.!
• నిబంధనలు ఉల్లంఘిస్తే ‘ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్’ కింద కేసులు: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరిక*
• సైలెన్సర్లు మార్చినా, పోలీస్ సైరన్లు వాడినా కఠిన చర్యలు తప్పవు
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : పట్టణంలో ద్విచక్ర వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా మోడిఫైడ్ సైలెన్సర్లు బిగించి, కర్ణకఠోర శబ్దాలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్న వారిపై ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. గత నెల రోజులుగా పట్టణంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి స్వాధీనం చేసుకున్న 121 మోడిఫైడ్ సైలెన్సర్లను సోమవారం స్థానిక కలెక్టర్ చౌరస్తాలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో రోడ్డు రోలర్‌తో తొక్కించి బహిరంగంగా ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. కొంతమంది యువకులు తమ బైక్‌లకు కంపెనీ సైలెన్సర్లను తొలగించి, విపరీతమైన శబ్దం, పటాకా సౌండ్స్ వచ్చేలా మోడిఫైడ్ సైలెన్సర్లను బిగిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా ఆసుపత్రుల పరిసర ప్రాంతాల్లో, నివాస సముదాయాల్లో వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు ఈ విపరీతమైన శబ్దాల వల్ల తీవ్ర మానసిక, శారీరక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా శాంతికి భంగం కలిగించే ఇలాంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనాలకు మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగించి, తిరిగి కంపెనీ సైలెన్సర్లను మాత్రమే బిగించి వాహనదారులను విడిచిపెట్టామన్నారు.
పర్యావరణ పరిరక్షణ చట్టం కింద కేసులు:.
ఇకపై జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటువంటి స్పెషల్ డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని ఎస్పీ హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించి మోడిఫైడ్ సైలెన్సర్లు వాడితే వాహనాల నుంచి వాటిని తొలగించడమే కాకుండా, సదరు వాహనదారులపై ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
వాహనాలకు మోడిఫైడ్ సైలెన్సర్లు బిగించే స్థానిక మెకానిక్‌లకు కూడా ఎస్పీ కఠిన ఆదేశాలు జారీ చేశారు. యువత అడిగినప్పటికీ నిబంధనలకు విరుద్ధమైన సైలెన్సర్లను బైక్‌లకు బిగించవద్దని, ఒకవేళ ఈ నిబంధనను ఉల్లంఘిస్తే సదరు మెకానిక్ షాపుల యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే, కొందరు నిబంధనలను అతిక్రమించి, అనధికారికంగా వాహనాలకు పోలీస్ సైరన్లను వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
పట్టణంలో ఎక్కడైనా మోడిఫైడ్ సైలెన్సర్లు ఉపయోగించినా లేదా అనధికారికంగా పోలీస్ సైరన్లు వాడుతున్నా ప్రజలు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. ఉల్లంఘనుల ఫోటోలు లేదా వివరాలను ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మొబైల్ నెంబర్ 8712659922 కు వాట్సాప్ ద్వారా పంపాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. పట్టణ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ప్రణయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక డ్రైవ్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు బి. సునీల్ కుమార్, ప్రణయ్ కుమార్, ఎస్‌ఐలు దేవేందర్, ప్రణయ్ కుమార్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
