HomeTrending NewsRaksha Bandhan : అనురాగాల పల్లవి... ఆత్మీయతకు ప్రతిరూపం : అన్నాచెల్లెళ్ల బంధానికి సజీవ సాక్ష్యం...

Raksha Bandhan : అనురాగాల పల్లవి… ఆత్మీయతకు ప్రతిరూపం : అన్నాచెల్లెళ్ల బంధానికి సజీవ సాక్ష్యం ‘రక్షాబంధన్’

శ్రావణ పౌర్ణమి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ఆత్మీయ పలకరింపుల పండుగ ‘రక్షాబంధన్’. మార్కెట్లలో కొలువుదీరిన రంగురంగుల రాఖీలు, స్వీట్ షాపుల ముందు సందడి, పోస్టాఫీసులు, కొరియర్ సెంటర్ల వద్ద కనిపించే రద్దీ… ఇవన్నీ రాఖీ పండుగ తీసుకొచ్చే ఒక అందమైన వాతావరణానికి నిదర్శనాలు. భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలు, ఆత్మీయతను ప్రపంచానికి చాటిచెప్పే పవిత్రమైన పండుగ ఇది. రక్త సంబంధానికి, నిస్వార్థమైన ప్రేమకు ప్రతిరూపంగా నిలిచే ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. చేతికి కట్టే చిన్న దారం… జీవితాంతం నీకు నేను తోడుంటాననే ఒక గొప్ప భరోసాకు ప్రతీకగా నిలుస్తోంది.

రక్షా’ అంటే రక్షణ, ‘బంధన్’ అంటే బంధం. తన సోదరుడికి ఎలాంటి ఆపద రాకూడదని, అతడు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ సోదరి కట్టే రక్షా కవచమే ఈ రాఖీ. నుదిటిన తిలకం దిద్ది, హారతి ఇచ్చి, తీపి తినిపించి సోదరుడి కుడి చేతి మణికట్టుకు రాఖీ కడుతుంది చెల్లి. దానికి బదులుగా, సోదరుడు ఆమెకు కానుకలు ఇవ్వడమే కాకుండా, ‘నీ జీవితంలో వచ్చే ప్రతి కష్టసుఖాల్లో నేను నీకు అండగా ఉంటాను’ అని ఇచ్చే మౌన వాగ్దానమే ఈ పండుగలోని అసలైన ఆంతర్యం. అందుకే రాఖీ కేవలం ఒక ఆచారం కాదు… ప్రేమ, నమ్మకం, బాధ్యత కలగలిపిన ఒక ఆత్మీయ బంధం.

బాల్య జ్ఞాపకాలకు సజీవ సాక్ష్యం.. 

మనిషి జీవితంలో బాల్యం ఒక మధురమైన ఘట్టం. అందులోనూ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరువలేనివి. చిన్నప్పుడు ఆటల్లో ఒకరినొకరు ఆటపట్టించుకోవడం, చిలిపి తగాదాలకు దిగడం, వస్తువుల కోసం గొడవ పడటం, అమ్మానాన్నల దగ్గర ఒకరిపై మరొకరు చాడీలు చెప్పుకోవడం… ఇవన్నీ ప్రతి ఇంటా జరిగేవే. కానీ, కాసేపటికే ఏమీ జరగనట్లు మళ్లీ కలిసిపోవడం, ఎవరికైనా కష్టం వస్తే అందరికంటే ముందుగా ఒకరికొకరు అండగా నిలవడం ఈ బంధంలోని ప్రత్యేకత. వయసు పెరిగి, బాధ్యతలు మారి, కాలం ఎంత మారుతున్నా ఆ బాల్యపు జ్ఞాపకాలు మాత్రం చెరిగిపోవు. అలాంటి మధురమైన, నిష్కల్మషమైన గతాన్ని మరోసారి కళ్లముందుకు తీసుకొచ్చే అద్భుతమైన సందర్భమే రక్షాబంధన్.

సాంకేతికత పెరిగినా… తగ్గని అనుబంధం..

ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో కుటుంబ సభ్యుల మధ్య కలయికలు తగ్గుతున్నాయి. ఉన్నత చదువులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం నేటి యువత దేశ విదేశాలకు వలస వెళుతున్నారు. ఒకే ఇంట్లో పెరిగిన అన్నాచెల్లెళ్లు వేర్వేరు నగరాల్లో, ఖండాల్లో జీవించాల్సిన పరిస్థితి. అయితే, దూరం అనేది కేవలం శరీరాలకే తప్ప మనసులకు కాదని ఈ పండుగ నిరూపిస్తోంది. పండుగ రోజున ప్రత్యక్షంగా కలుసుకోలేని వారు పోస్టులు, కొరియర్ల ద్వారా రాఖీలు పంపిస్తూ తమ ప్రేమను చాటుకుంటున్నారు. దూరదేశాల్లో ఉన్న తమ సోదరులకు రాఖీలు పంపి, ఆన్‌లైన్ ద్వారా కానుకలు అందుకుంటున్నారు. వీడియో కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా వర్చువల్ గానే పండుగను జరుపుకుంటూ ఆధునిక సాంకేతికతను తమ అనుబంధానికి వారధిగా మలచుకుంటున్నారు.

రాఖీ విలువ ఎప్పుడూ దాని ధరలోనో, డిజైన్‌లోనో ఉండదు… దాని వెనుక దాగి ఉన్న సోదరి ప్రేమలో ఉంటుంది. పట్టుదారమైనా, ముత్యాలు పొదిగినదైనా అది పంచే ఆత్మీయత ఒక్కటే. సోదరి కట్టే ఆ చిన్న రాఖీ, సోదరుడికి తన బాధ్యతను నిరంతరం గుర్తుచేస్తుంది. అలాగే సోదరుడు ఇచ్చే భరోసా, సోదరికి సమాజంలో ఎంతో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. కేవలం తోబుట్టువుల మధ్యే కాకుండా, పరస్పర ప్రేమ, గౌరవం, ఆదరణతో స్నేహితులు, పరిచయస్తుల మధ్య కూడా ఈ రాఖీలు కట్టుకోవడం ద్వారా సమాజంలో సోదరభావం వెల్లివిరుస్తోంది.

కాలం మారుతోంది, జీవనశైలి మారుతోంది… కానీ కుటుంబ బంధాల పట్ల భారతీయులకు ఉన్న గౌరవం మాత్రం మారలేదు. ఎంత దూరంలో ఉన్నా, ఎంతటి బిజీ జీవితం గడుపుతున్నా ఒకరి క్షేమాన్ని మరొకరు కోరుకోవడం ఈ బంధానికి ఉన్న గొప్పతనం. రక్షాబంధన్ ఈ అనుబంధాన్ని ఏటా మరింత పచ్చగా, బలంగా మారుస్తోంది.

రాఖీ అంటే ఏంటి..?

ఇది కేవలం చేతికి కట్టే ఒక దారం కాదు.. కష్టకాలంలో ఆదుకునే ఒక నమ్మకం.. జీవితాంతం నీకు నేనున్నాననే ఒక బాధ్యత.. అడుగడుగునా తోడుండే ఒక భరోసా.. రెండు హృదయాలను జన్మజన్మల పాటు కలిపి ఉంచే పవిత్రమైన ప్రేమ బంధం.. అన్న చేయి చెల్లికి కొండంత ధైర్యం.. చెల్లి చూపే ప్రేమ అన్నకు అపారమైన బలం.. వీరిద్దరి నిస్వార్థ అనుబంధానికి రాఖీయే కలకాలం సజీవ సాక్ష్యం..

కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు యాంత్రికంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో, ఆత్మీయతకు అద్దం పట్టే ఇలాంటి పండుగలు మన సంస్కృతికి జీవనాడి లాంటివి. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఈ అపురూపమైన ప్రేమానుబంధం ఇలాగే కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ… పాఠకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. !

– Qamar sd

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!

జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular