• డబ్బుల రికవరీకి కిడ్నాప్ డ్రామా..
• గుట్టు రట్టు చేసిన పోలీసులు
• రెండు కేసుల్లో ఆరుగురి అరెస్ట్..
• పరారీలో మరో ఐదుగురు
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : దొంగ నోట్లతో రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలన్న అత్యాశ ఆ ముఠా పాలిట శాపంగా మారింది. దొంగనోట్ల గ్యాంగ్ చేతిలో అసలుకే మోసం రావడంతో.. పోయిన డబ్బును రాబట్టుకునేందుకు కిడ్నాప్ నాటకానికి తెరతీసి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. దొంగనోట్ల కొనుగోలు వ్యవహారంతో పాటు, కిడ్నాప్ డ్రామా ఆడిన రెండు వేర్వేరు కేసుల్లో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆయన ఈ కేసు వివరాలను మీడియాతో పంచుకున్నారు.
పంధార్కవాడకు చెందిన ప్రతీక్ అనే వ్యక్తి ద్వారా ఆదిలాబాద్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు చెందిన దీపక్ పవార్, అలోక్, సురేందర్‌లకు నాగ్‌పూర్‌కు చెందిన దొంగ నోట్ల ముఠాతో పరిచయం ఏర్పడింది. లక్ష రూపాయల అసలు నోట్లకు నాలుగు లక్షల నకిలీ కరెన్సీ ఇస్తామని సదరు ముఠా వీరిని నమ్మించింది. దీంతో రూ.5 లక్షలు ఇచ్చి రూ.20 లక్షల నకిలీ నోట్లు పొందాలని వీరు పథకం పన్నారు. పెట్టుబడి కోసం మహారాష్ట్రలోని గడ్చందూర్ ప్రాంతంలో ఉంటున్న షేక్ షకీబ్ వద్ద లాభాల్లో వాటా ఇస్తామని చెప్పి రూ.5 లక్షలు తీసుకున్నారు. ఈ నెల 10న మావల బైపాస్ వద్ద నాగ్‌పూర్ ముఠాకు ఆ డబ్బును అందజేశారు. వారు నకిలీ కరెన్సీ ఉన్నట్లుగా ఓ బాక్సును చూపిస్తున్న సమయంలోనే.. ముందస్తు ప్లాన్ ప్రకారం ఆ నాగ్‌పూర్ ముఠాకే చెందిన మరికొందరు ‘మేము పోలీసులం’ అంటూ అక్కడికి చేరుకున్నారు. దీంతో భయాందోళనకు గురైన బాధితులు అక్కడినుంచి పరుగులు తీయగా, దొంగనోట్ల ముఠా ఆ 5 లక్షలతో నాగ్‌పూర్ వైపు పరారైంది.
కిడ్నాప్ డ్రామా.. పోలీసుల ఎంట్రీ..!!
తాము ఇచ్చిన 5 లక్షల రూపాయలు మోసపోవడంతో పెట్టుబడి పెట్టిన షేక్ షకీబ్ తన అనుచరులైన మహ్మద్ సితార్, ప్రథమ్లతో కలిసి దళారులైన సురేందర్, అలోక్, దీపక్‌లను నిర్బంధించారు. తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తూ సురేందర్ చేత అతని భార్యకు ఫోన్ చేయించారు. తనను కొందరు కిడ్నాప్ చేశారని, రూ.5 లక్షలు ఇస్తేనే వదిలేస్తారని ఆమెను నమ్మించారు. భయాందోళనకు గురైన సురేందర్ భార్య మావల పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నాప్ కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల 13న దస్నాపూర్ పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారును ఆపి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్ వ్యవహారం వెనుక దొంగనోట్ల బాగోతం ఉన్నట్లు పోలీసులు గుర్తించి రెండో కేసు నమోదు చేశారు.
ఆరుగురి అరెస్ట్.. కార్లు, నగదు స్వాధీనం..
కిడ్నాప్‌కు పాల్పడిన షేక్ షకీబ్, మహ్మద్ సితార్, ప్రథమ్ రవీంద్ర గురుకుందల్వార్లను ఒక కేసులో అరెస్టు చేయగా.. దొంగనోట్ల కొనుగోలుకు యత్నించిన కేసులో దీపక్ శ్రీరామ్ పవార్, సర్కార్ అలోక్, ఎల్చల్‌వార్ సురేందర్‌లను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి ఒక హ్యుందాయ్ ఐ20 కారు, ఐఫోన్ 17 ప్రో తో పాటు మరో రెండు మొబైల్స్ , రూ.30 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో ప్రధాన సూత్రధారి ప్రతీక్‌తో పాటు నాగ్‌పూర్‌కు చెందిన నలుగురు దొంగనోట్ల ముఠా సభ్యులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశామని డీఎస్పీ తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఇలాంటి మోసగాళ్ల వలలో పడితే నేరస్థులుగా మారక తప్పదని ఆయన ప్రజలను హెచ్చరించారు. ఈ దర్యాప్తులో ప్రతిభ చూపిన మావల సీఐ బీడీ ప్రేమ్ కుమార్, ఎస్ఐ రాజశేఖర్ తదితరులను డీఎస్పీఅభినందించారు.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో వెంటనే చేరండి!
జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్