HomeTrending Newsసామాన్యుడికో న్యాయం.. 'డేరా'కు మరో న్యాయమా?

సామాన్యుడికో న్యాయం.. ‘డేరా’కు మరో న్యాయమా?

• హత్య, అత్యాచార కేసుల ఖైదీకి ఇన్నిసార్లు పెరోలా?

• తొమ్మిదేళ్లలో ఏకంగా 17 సార్లు జైలు నుంచి వెలుపలికి..

• ఎనిమిది నెలల వ్యవధిలోనే మూడు నెలలు బయటే!

• పంజాబ్ ఎన్నికల కోసమేనంటూ సర్వత్రా విమర్శలు

అత్యాచారం, హత్య లాంటి అత్యంత తీవ్రమైన, హేయమైన నేరాలకు పాల్పడి 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద గురువు డేరా బాబా వ్యవహారంలో చట్టాలు చుట్టాలుగా మారాయా..? పలుకుబడి ఉంటే ప్రభుత్వాలు ఎలా వత్తాసు పలుకుతాయో చెప్పడానికి డేరా బాబా పెరోల్ పర్వమే నిదర్శనమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత తొమ్మిదేళ్ల కాలంలో ఆయన ఏకంగా 17 సార్లు పెరోల్ పై జైలు నుంచి బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ ఒక్క ఏడాది గణాంకాలను పరిశీలిస్తే.. జనవరి నెలలో 42 రోజులు, ఆ తర్వాత మే నెలలో 30 రోజులు పెరోల్ మీద ఆయన బయటకు వచ్చారు. జూన్ 26న తిరిగి జైలుకు వెళ్లిన ఆయన.. ఇప్పుడు మళ్లీ 21 రోజుల పెరోల్‌పై బయటకు రావడం గమనార్హం. అంటే, కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే సుమారు మూడు నెలల పాటు ఆయన జైలు వెలుపలే స్వేచ్ఛగా గడిపారు.

సామాన్య ఖైదీలకు ఎందుకివ్వరు..?

సాధారణంగా హత్య, అత్యాచారం లాంటి దారుణమైన నేరాల్లో శిక్ష పడ్డ ఖైదీకి ఇంత తరచుగా పెరోల్ మంజూరు చేయడం అనేది జరగని పని. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లేదా జైలు నిబంధనల ప్రకారం.. సామాన్య ఖైదీలకు అత్యవసర పరిస్థితుల్లో ఏడాదికి ఒకసారి పెరోల్ లభించడమే గగనంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో, ఒక కరుడుగట్టిన నేరస్థుడికి పదేపదే పెరోల్ ఇవ్వడం వెనుక ఉన్న రాజకీయ పలుకుబడి స్పష్టమవుతోంది. కటకటాల వెనుక కూడా ఆయనకు సకల రాజభోగాలు అందుతున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.

రాజకీయ ప్రయోజనాల కోసమేనా..?

వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే సర్కారు ఈ తరహాలో వత్తాసు పలుకుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. పెరోల్ పై బయటకు వచ్చి ఆశ్రమంలో ఆయన నిర్వహించే ప్రవచనాల ద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరతీస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి, సామాన్యులకు ఒక విధంగా, పరపతి ఉన్న బడాబాబులకు మరో విధంగా మన చట్టాలు, వ్యవస్థలు, ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికే మచ్చగా మిగులుతోంది.

– QAMAR Sd

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!

జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular