• ఫోన్లో మాట్లాడాలని వేధింపులు.. ఫోటోలు అప్లోడ్ చేసి పరువు భంగం
• నిందితునిపై అట్రాసిటీ కేసు నమోదు..
• కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ హెచ్చరిక
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : మహిళను వేధించడమే కాకుండా, ఆమె పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా సృష్టించి ఫోటోలు ఉంచిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ వివరాలు ఉట్నూర్ ఏఎస్పీ రిత్విక్ సాయి కొట్టే వెల్లడించారు. ఏఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలోని దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళను కొంతకాలంగా ఫోన్లో మాట్లాడాలని బెదిరిస్తూ నిందితుడు వేధిస్తున్నాడు. అంతటితో ఆగకుండా బాధితురాలి పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచి, అందులో ఆమె ఫోటోలు అప్లోడ్ చేస్తూ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిందితుడిని ప్రఫుల్ దత్తాజీ బేజవార్ @ బేజ్జరావర్ ప్రఫుల్ @ నాని (33) గా గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, సోషల్ మీడియా ద్వారా వేధింపులకు పాల్పడటం, కులం పేరుతో దూషించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో వెంటనే చేరండి!
జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్