• ఇచ్చోడలో ఇద్దరు దళారుల అరెస్ట్, 58 ప్యాకెట్ల సీజ్
• అమాయక రైతులే లక్ష్యంగా సాగుతున్న దందా
•ప్రధాన సూత్రధారి ఆదిలాబాద్ వాసిగా గుర్తింపు
• రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఇచ్చోడ ఎస్.హెచ్.ఓ నరేష్ కుమార్
వాస్తవ నేస్తం,ఇచ్చోడ : అమాయక రైతులను నిలువు దోపిడీ చేస్తున్న నకిలీ పత్తి విత్తనాల విక్రేతలపై ఇచ్చోడ పోలీసులు ఉక్కుపాదం మోపారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖలతో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ టాస్క్ ఫోర్స్ బృందం కొరడా ఝుళిపించింది. నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరు దళారులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 58 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఇచ్చోడ ఎస్.హెచ్.ఓ నరేష్ కుమార్ వెల్లడించారు.
రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ధాబా(బి) గ్రామానికి చెందిన నర్వాటే ఈశ్వర్ వద్ద తనిఖీలు నిర్వహించగా.. అతని వద్ద 34 పింక్ బాండ్ నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు దొరికాయి. అదేవిధంగా ఇచ్చోడలోని సాయినగర్‌కు చెందిన రాథోడ్ గణేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అతని వద్ద మరో 24 ‘పింక్ బాండ్ (5G)’ ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ బృందం స్వాధీనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్.హెచ్.ఓ తెలిపారు.
పట్టుబడిన విత్తనాల ప్యాకెట్లపై కనీసం టెస్టింగ్ తేదీ, ప్యాకింగ్ తేదీ, లాట్ నంబర్, గడువు తేదీ వంటి ప్రాథమిక వివరాలు కూడా లేకపోవడంతో వ్యవసాయ అధికారులు వాటిని పూర్తిగా నకిలీవిగా నిర్ధారించారు.
తీగ లాగితే డొంక కదిలింది..
పోలీసుల విచారణలో నకిలీ విత్తనాల దందా వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్లు వెలుగుచూసింది. ఈ నకిలీ విత్తనాలకు ఆదిలాబాద్‌కు చెందిన పాపిన్‌వార్ సునీల్ కుమార్ ప్రధాన సరఫరాదారుగా పోలీసులు గుర్తించారు. నిందితులు ఇద్దరూ సునీల్ వద్దే విత్తనాలు కొనుగోలు చేసి ఇచ్చోడ పరిసర ప్రాంతాల్లోని రైతులకు విక్రయిస్తున్నారు. నర్వాటే ఈశ్వర్ ఇప్పటికే సుమారు 300 ప్యాకెట్లను హట్కరే విజయ్ అనే వ్యక్తికి, గణేష్ మరో 100 ప్యాకెట్లను ఇతర వ్యక్తులకు విక్రయించినట్లు విచారణలో అంగీకరించినట్లు ఎస్.హెచ్.ఓ తెలిపారు. అరెస్ట్ అయిన ఇద్దరు నిందితులను (నర్వాటే ఈశ్వర్, రాథోడ్ గణేష్) రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ ముఠాకు ప్రధాన సరఫరాదారుగా ఉన్న పాపిన్‌వార్ సునీల్ కుమార్ ఇప్పటికే వేరొక కేసులో అరెస్టై జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. ఈ కేసులో విత్తనాలు కొనుగోలు చేసి పరారీలో ఉన్న మరో నిందితుడు హట్కరే విజయ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
వానాకాలం సీజన్ నేపథ్యంలో రైతులు విత్తనాల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలి. అధిక లాభాల ఆశచూపి తక్కువ ధరకు విక్రయించే నకిలీ విత్తనాలను కొని మోసపోవద్దు. గుర్తింపు పొందిన డీలర్ల వద్దే పక్కా రశీదుతో కూడిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా విత్తనాలు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే.. వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలి అని ఎస్.హెచ్.ఓ నరేష్ కుమార్ రైతులకు సూచించారు.
