HomePolitical Newsఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు గౌరవ వేతనం కల్పించాలి : బద్దం రాంచందర్ రెడ్డి

ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు గౌరవ వేతనం కల్పించాలి : బద్దం రాంచందర్ రెడ్డి

• జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన ఆదిలాబాద్ జిల్లా ఉప సర్పంచుల ఫోరం

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: గ్రామ పంచాయతీల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు తక్షణమే గౌరవ వేతనం కల్పించాలని ఆదిలాబాద్ జిల్లా ఉప సర్పంచుల ఫోరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఫోరం జిల్లా అధ్యక్షుడు బద్దం రాంచందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌కు మంగళవారం ఒక వినతిపత్రం సమర్పించారు. గ్రామ పరిపాలన, సంక్షేమ పథకాల అమలులో ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులుగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, అయినప్పటికీ వారికి ఎలాంటి గౌరవ వేతనం లేకపోవడం తీవ్ర బాధాకరమని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఉప సర్పంచులకు రూ. 5000, వార్డు సభ్యులకు రూ. 3000 చొప్పున ప్రభుత్వం వెంటనే గౌరవ వేతనం మంజూరు చేయాలని వారు కోరారు.

ఈ సందర్భంగా ఉప సర్పంచుల ఫోరం పలు ప్రధాన డిమాండ్లను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. ముఖ్యంగా పంచాయతీ చట్టంలోని సెక్షన్ 38 ప్రకారం.. సర్పంచ్ గైర్హాజరైనప్పుడు లేదా పదవి ఖాళీ అయినప్పుడు ఆ అధికారాలను ఉప సర్పంచ్‌కు బదిలీ చేయాలని, తద్వారా గ్రామాల్లో అవినీతి నియంత్రణ, జవాబుదారీతనం పెరుగుతుందని వారు కోరారు. అలాగే, గ్రామ పంచాయతీ తీర్మానాల పత్రాలపై సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు కూడా సంతకం చేసే హక్కు కల్పించాలని, గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల శిలాఫలకాలపై విధిగా తమ పేర్లు చేర్చాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, మండల స్థాయిలో జరిగే సర్వసభ్య సమావేశాలకు ఉప సర్పంచులను అధికారికంగా ఆహ్వానించడంతో పాటు, గ్రామ పంచాయతీలోని వివిధ స్టాండింగ్ కమిటీలలో సర్పంచ్‌ను చైర్మన్‌గా, ఉప సర్పంచ్‌ను వైస్ చైర్మన్‌గా గుర్తించాలని వారు వినతిపత్రంలో స్పష్టం చేశారు.

ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద జిల్లా ఉప సర్పంచుల ఫోరం సభ్యులు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular