• కళాశాలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన రాజు రాథోడ్
• హర్షం వ్యక్తం చేసిన కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం
వాస్తవ నేస్తం,హైదరాబాద్ : గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన చారిత్రాత్మక కార్యక్రమంలో అద్భుత ప్రతిభ కనబరిచిన మార్వాడి శిక్షా సమితి (MSS) లా కాలేజీ మూడవ సంవత్సరం ఎల్‌ఎల్‌బీ విద్యార్థి రాజు రాథోడ్.. ప్రతిష్టాత్మక ‘గిన్నిస్ వరల్డ్ రికార్డు’ను సొంతం చేసుకున్నాడు. ఈ అంతర్జాతీయ స్థాయి విజయంతో రాజు రాథోడ్ తన కళాశాలకు అరుదైన గౌరవాన్ని తీసుకువచ్చాడు.
ఈ మెగా ఈవెంట్‌లో జాతీయ స్థాయి నుంచి సుమారు 2,800 మంది అభ్యర్థులు పాల్గొనగా, వారిలో కేవలం 1,212 మంది మాత్రమే విజయవంతంగా అర్హత సాధించి అధికారికంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్లుగా నిలిచారు. ఇందులో రాజు రాథోడ్ ఒకరు. మరో విశేషమేమిటంటే.. రాజు రాథోడ్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందిన మార్వాడి శిక్షా సమితి లా కాలేజీ విద్యార్థుల బృందం కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొని, తమ అంకితభావం, సమష్టి కృషితో గతంలో ఉన్న గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టి సత్తా చాటారు. ఈ విజయం సాధించిన రాజు రాథోడ్‌ను కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వందన, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎండీ ఆదిల్, హెచ్ఓడి రీటా, కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు. అతని క్రమశిక్షణ, అంకితభావాన్ని వారు కొనియాడారు. భవిష్యత్తులో రాజు రాథోడ్ మరిన్ని పతకాలు, ఛాంపియన్‌షిప్‌లు, అంతర్జాతీయ అవార్డులు సాధించి కళాశాలకు, దేశానికి మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాజు రాథోడ్ మాట్లాడుతూ.. సంతోషం వ్యక్తం చేశారు. రికార్డు సాధించడంలో తనను ప్రోత్సహించిన కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వందన, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎండీ ఆదిల్, హెచ్ఓడి రీటా, ఇతర యాజమాన్య సభ్యులకు, అధ్యాపకులకు, తోటి మిత్రులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
