HomeBreaking Newsఅత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో న్యాయవాదులపై దౌర్జన్యం... తీవ్రంగా స్పందించిన హైకోర్టు

అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో న్యాయవాదులపై దౌర్జన్యం… తీవ్రంగా స్పందించిన హైకోర్టు

📰 Generate e-Paper Clip

• సీసీటీవీ ఫుటేజ్ సమర్పించాలని పోలీసులకు ఆదేశం…l

• బాధిత న్యాయవాదులకు అండగా బోథ్ బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: హైదరాబాద్ లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో ఉన్న న్యాయవాదుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేయగా, బాధిత న్యాయవాదులకు మద్దతుగా బోథ్ బార్ అసోసియేషన్ కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపింది.

ఈ నెల 22న (మంగళవారం) న్యాయవాదులు షేక్ అఖీబ్, ఒక మహిళా న్యాయవాది తమ వృత్తిపరమైన పని నిమిత్తం అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అదే సమయంలో పోలీసులు ఒక సాధారణ పౌరుడి పట్ల అమానుషంగా ప్రవర్తించడాన్ని గమనించిన న్యాయవాదులు, వారి తీరును ఆక్షేపించారు. ఈ అన్యాయాన్ని తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకుని వీడియోలు తీయకుండా నిరోధించారు. అంతటితో ఆగకుండా, వారిని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు కూడా వెళ్లనివ్వకుండా నిర్బంధించారు. పోలీసుల తీరుపై అక్కడే ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పటికీ వారు అనుమతించలేదు. దీంతో, బాధితులు పోస్ట్ ద్వారా తమ ఫిర్యాదును పంపి, మరుసటి రోజు (సెప్టెంబర్ 23న) తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలని హైకోర్టు ఆదేశం:

జస్టిస్ టి.ఎం.డి ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్‌ను విచారించింది. విచారణలో భాగంగా హోమ్ శాఖ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ వాదనలు వినిపిస్తూ.. న్యాయవాదులు తమకు సంబంధం లేని కేసులో జోక్యం చేసుకోవడం వల్లే వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత జరిగిన దానికి పోలీసులు క్షమాపణలు కూడా చెప్పారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి, సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం 11:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని తక్షణం భద్రపరచాలని అధికారులను ఆదేశించారు. తదుపరి విచారణ తేదీ అయిన సెప్టెంబర్ 30వ తేదీ లోపు కోర్టు ముందు సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను వెంటనే అమలు చేసేలా చూడాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించారు.

బాధితులకు బోథ్ బార్ అసోసియేషన్ అండ :

అత్తాపూర్ ఘటనను బోథ్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. బాధితులైన న్యాయవాది షేక్ అఖీబ్, మహిళా న్యాయవాదికి పూర్తి సంఘీభావం ప్రకటిస్తూ బోథ్ కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. తోటి న్యాయవాదులకు మద్దతుగా ఈ నెల 22 (మంగళవారం) మరియు 24 (గురువారం) తేదీలలో కోర్టు కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నట్లు బార్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

 

Boath Bar Association lawyers protest
Boath Bar Association boycotts court duties in protest of the Attapur police incident.

ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. వృత్తిపరమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న న్యాయవాదుల పట్ల పోలీసుల దౌర్జన్యం సరికాదన్నారు. న్యాయవాదులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఈ ఘటనలోని బాధితులకు తక్షణమే న్యాయం జరగాలని వారు డిమాండ్ చేశారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!

జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular