HomeCrime Newsసాక్షికి ప్రాణహాని బెదిరింపులు.. నిందితుడికి ఏడాది జైలు శిక్ష

సాక్షికి ప్రాణహాని బెదిరింపులు.. నిందితుడికి ఏడాది జైలు శిక్ష

* తీర్పు వెల్లడించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు

* పకడ్బందీగా దర్యాప్తు.. కోర్టులో రుజువైన నేరం

* పోలీసు సిబ్బందిని అభినందించిన ఎస్పీ అఖిల్ మహాజన్

 

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: కోర్టులో సాక్ష్యం చెబితే ప్రాణాలు తీస్తానంటూ సాక్షిని బెదిరించిన కేసులో ఓ నిందితుడికి ఒక సంవత్సరం జైలు శిక్ష పడింది. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు తీర్పు వెలువరించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కోర్టు లైజన్ అధికారి గంగా సింగ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..

ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ అలీ అనే వ్యక్తి ఇంటికి 2025 ఆగస్టు 17వ తేదీ న సత్ నెంబర్ గ్రామానికి చెందిన వనోలె పాండురంగ్ (53) వెళ్లాడు. కోర్టులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే, నీతో పాటు నీ భార్యాపిల్లలను కూడా చంపేస్తానని బాధితుడిని తీవ్రంగా బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన మహమ్మద్ అలీ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు స్పందించిన ఎస్సై పురుషోత్తం.. నిందితుడు పాండురంగ్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు డ్యూటీ అధికారి, ఏఎస్ఐ రవీందర్ రెడ్డి మొత్తం ఐదుగురు సాక్షులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రహీం సాక్షులను విచారించి, న్యాయమూర్తి ముందు నిందితుడి నేరాన్ని నిర్ధారించారు. పక్కా సాక్ష్యాధారాలతో నేరం రుజువు కావడంతో, నిందితుడు పాండురంగ్‌కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. సాక్షిని బెదిరించిన కేసులో నిందితుడికి శిక్ష పడేలా పకడ్బందీగా వ్యవహరించిన పోలీసు సిబ్బంది, దర్యాప్తు అధికారులు, మరియు కోర్టు సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేకంగా అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular