దేశంలో వేగంగా మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధుల నేపథ్యంలో రాబోయే కేంద్ర బడ్జెట్ (Budget 2026) పై హెల్త్‌కేర్ రంగం భారీ ఆశలు పెట్టుకుంది. ఇప్పటి వరకు చికిత్సకే పరిమితమైన ఆరోగ్య విధానాల నుంచి బయటపడి, వ్యాధులు రాకుండా ముందే అడ్డుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందా అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.
వైద్య ద్రవ్యోల్బణం (Medical Inflation) వేగంగా పెరుగుతున్న వేళ, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ బడ్జెట్‌లో ప్రజలపై పడుతున్న వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించే చర్యలు ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్‌ను ప్రోత్సహించేలా పన్ను రాయితీల్లో మార్పులు తీసుకురావాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80D కింద ప్రస్తుతం ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ మినహాయింపు పరిమితి సరిపోవడం లేదని ఇన్సూరెన్స్ రంగం చెబుతోంది. ఈ పరిమితిని పెంచితే మధ్యతరగతి కుటుంబాలు సరైన కవరేజ్ ఉన్న పాలసీలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీని వల్ల దీర్ఘకాలంలో ఆసుపత్రులపై ఆధారపడటం తగ్గి, ప్రజల ఆరోగ్య ఖర్చులు నియంత్రణలోకి వచ్చే అవకాశముంది.
ప్రివెంటివ్ కేర్, చిన్న నగరాలపై ఫోకస్ పెరగనా?
ఐసీఆర్ఏ (ICRA) వంటి రేటింగ్ ఏజెన్సీల అంచనాల ప్రకారం, Budget 2026లో లైఫ్‌స్టైల్ వ్యాధులను అరికట్టే విధానాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. షుగర్, బీపీ, గుండె జబ్బులు వంటి వ్యాధులు మొదటిదశలోనే గుర్తించే ప్రివెంటివ్ కేర్ (Preventive Care) వ్యవస్థలను బలోపేతం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.
టయర్-2, టయర్-3 పట్టణాల్లో ఆధునిక వైద్య సదుపాయాలు ఇంకా పరిమితంగానే ఉన్నాయి. ఈ లోటును తీర్చేందుకు ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు పెట్టే వారికి పన్ను రాయితీలు ఇవ్వాలని హెల్త్‌కేర్ రంగం కోరుతోంది. అదే సమయంలో డాక్టర్లు, నర్సుల కొరతను తగ్గించేందుకు మెడికల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్‌పై ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి.
భారత్ ప్రపంచానికి మందుల సరఫరా చేసే కీలక దేశంగా ఉన్నప్పటికీ, ఔషధ ముడి పదార్థాల (API) విషయంలో ఇప్పటికీ విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు ఫార్మా రంగానికి సంబంధించిన పీఎల్ఐ (PLI) పథకాలను మరింత విస్తరించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D) పై చేసే ఖర్చులకు పన్ను మినహాయింపులను తిరిగి తీసుకురావాలన్న డిమాండ్ కూడా ఉంది.
ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హెల్త్-టెక్ రంగాలపై ఈ బడ్జెట్‌లో ప్రత్యేక దృష్టి పడే అవకాశం ఉందని అంచనా. జబ్బులను ముందుగానే గుర్తించే టెక్నాలజీలు, వేరబుల్స్ (Wearables), రిమోట్ మానిటరింగ్ సిస్టమ్స్‌ను ఇన్సూరెన్స్ ప్లాన్లతో అనుసంధానిస్తే ప్రజలపై వచ్చే దీర్ఘకాలిక వైద్య ఖర్చులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

దేశీయంగా మెడికల్ పరికరాల తయారీని ప్రోత్సహిస్తే, దిగుమతులపై ఆధారపడటం తగ్గి వైద్య సేవలు మరింత చౌకగా అందుబాటులోకి వస్తాయని హాస్పిటల్ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఈసారి బడ్జెట్ కేవలం ఆసుపత్రుల నిర్మాణానికే కాకుండా, టెక్నాలజీ, ఇన్సూరెన్స్, దేశీయ తయారీ ద్వారా సామాన్యుడి ఆరోగ్య భద్రతను ఎలా బలోపేతం చేస్తుందో అన్నదే కీలకంగా మారింది.
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే సూత్రాన్ని Budget 2026 ఎంతవరకు కార్యరూపం దాల్చుస్తుందో చూడాల్సిందే.
Author QAMAR SD , Vaasthava Nestham
