వాస్తవ నేస్తం,బిజినెస్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో లోన్లు, పెట్టుబడులు, ఇన్సూరెన్స్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు స్పష్టమైన అవగాహన చాలా అవసరం. చిన్న పొరపాటు కూడా భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడికి కారణమవుతుంది. అందుకే సాధారణంగా చాలామందికి ఎదురయ్యే కొన్ని ముఖ్యమైన ఆర్థిక సందేహాలపై స్పష్టత తెలుసుకోవడం అవసరం.
ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన బంగారంపై లోన్ పొందవచ్చా అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది. సాధారణంగా ఆన్‌లైన్‌లో కాయిన్లు లేదా ఆభరణాల రూపంలో కొనుగోలు చేసిన బంగారాన్ని తనఖా పెట్టుకోవచ్చు. అయితే అది 22 లేదా 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగి ఉండాలి. ఒరిజినల్ బిల్లు తప్పనిసరి. హాల్‌మార్క్ ఉంటే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు సులభంగా అంగీకరిస్తాయి. కొన్ని బ్యాంకులు నిబంధనల్లో కఠినంగా ఉన్నా, ఎన్‌బీఎఫ్‌సీలు వేగంగా రుణం అందిస్తాయి.
స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ఖాతా తెరవాలంటే సిబిల్ స్కోరు అవసరం లేదు. 18 ఏళ్లు నిండినవారు పాన్ కార్డు, ఆధార్, బ్యాంకు ఖాతా, మొబైల్ నంబరు, ఈమెయిల్‌తో ఖాతా ఓపెన్ చేయవచ్చు. అయితే ఎఫ్‌అండ్‌ఓ లేదా డెరివేటివ్స్‌లో ట్రేడింగ్ చేయాలంటే ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం అవుతాయి.

మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్‌ల ద్వారా పెట్టుబడులు పెట్టేవారు దీర్ఘకాల దృష్టితో ముందుకు సాగాలి. ఏడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తేనే మంచి ఫలితాలు ఆశించవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ సరిపోదని అనిపిస్తే టాప్-అప్ పాలసీ ఒక మంచి ఎంపిక కావచ్చు. అయితే మీ అవసరాలు, బడ్జెట్‌ను బట్టి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
– Qamar SD
