వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి అనిశ్చితి ముసుగులోకి వెళ్లింది. అమెరికా రాజకీయ పరిణామాలు, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఫెడరల్ రిజర్వ్ చుట్టూ ఏర్పడిన వివాదాలు మొత్తం కలసి బంగారం ధరలను చరిత్రలోనే అత్యున్నత స్థాయికి నెట్టేశాయి.
సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి వైపు పెట్టుబడిదారులు ఒక్కసారిగా మళ్లడంతో గోల్డ్ మార్కెట్‌లో భారీ కదలికలు కనిపిస్తున్నాయి.
ఫెడ్‌పై ట్రంప్ ఒత్తిడి… మార్కెట్లలో నమ్మకం కుదేలు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్‌కు న్యాయ శాఖ నుంచి గ్రాండ్ జ్యూరీ సమన్లు అందడం రాజకీయంగా తీవ్ర చర్చలకు దారితీసింది. ఫెడ్ ప్రధాన కార్యాలయ పునరుద్ధరణ వ్యయాలపై కాంగ్రెస్ ముందు ఇచ్చిన వాంగ్మూలానికి సంబంధించి ఈ సమన్లు జారీ అయినట్లు వెల్లడైంది.
ఈ పరిణామం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్–పావెల్ మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతను మరింత పెంచింది. కేంద్ర బ్యాంకు స్వతంత్రతపై సందేహాలు తలెత్తడంతో మార్కెట్లలో అనిశ్చితి ఒక్కసారిగా పెరిగింది. డాలర్‌పై నమ్మకం తగ్గడంతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మళ్లారు.
ఈ నేపథ్యంలో బులియన్ ధరలు ఒక్కసారిగా ఎగిసి ఔన్సుకు 4,600 డాలర్ల స్థాయిని తాకాయి. సింగపూర్ సమయం ప్రకారం ఉదయం 9:08 గంటలకు గోల్డ్ ధర 1.7 శాతం పెరిగి 4,585.39 డాలర్లకు చేరుకుంది.
ఇరాన్ నిరసనలు, వడ్డీ కోతల అంచనాలు… బంగారానికి డబుల్ బూస్ట్
ఇదే సమయంలో ఇరాన్‌లో తీవ్రతరం అవుతున్న నిరసనలు మధ్యప్రాచ్య రాజకీయాలను మరింత అస్థిరంగా మార్చాయి. అక్కడి పాలన కూలిపోయే అవకాశాలపై చర్చలు పెరగడంతో చమురు మార్కెట్లతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే బలహీనంగా ఉండటంతో ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది రెండో అర్ధభాగంలో కనీసం రెండు వడ్డీ కోతలు విధిస్తుందన్న అంచనాలు బలపడ్డాయి. వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారానికి ఇది కీలక మద్దతుగా మారింది.
గత వారం దాదాపు 10 శాతం పెరిగిన వెండి ధర తాజాగా మరో 4.6 శాతం లాభపడింది. పల్లాడియం, ప్లాటినం ధరలు కూడా పాజిటివ్‌గా కదిలాయి. అదే సమయంలో బ్లూమ్‌బెర్గ్ డాలర్ స్పాట్ ఇండెక్స్ 0.2 శాతం తగ్గింది.
సాక్సో మార్కెట్స్ వ్యూహకర్త చారు చనానా మాట్లాడుతూ, భౌగోళిక రాజకీయాలు, వృద్ధి–వడ్డీ రేట్ల చర్చలు, సంస్థాగత రిస్క్‌లు అన్నీ కలసి మార్కెట్లలో అనిశ్చితి ఎంత ఎక్కువగా ఉందో ఇది చూపిస్తోందని వ్యాఖ్యానించారు.

ఇక ట్రంప్ విధించిన సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు త్వరలో కీలక తీర్పు ఇవ్వనుంది. అది ట్రంప్ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా వస్తే, వైట్ హౌస్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఎదుర్కొనే అతిపెద్ద చట్టపరమైన సవాలుగా మారే అవకాశముంది.
ఈ అన్ని పరిణామాలు కలిపి చూస్తే, ప్రపంచ మార్కెట్లు ఇప్పట్లో శాంతించే పరిస్థితి కనిపించడం లేదు. అలాంటి వేళ బంగారం తన సురక్షిత పెట్టుబడి హోదాను మరింత బలపరుచుకుంటోంది.
Author: Qamar SD
