వాస్తవ నేస్తం,బిజినెస్ డెస్క్: బంగారం ధరలు రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. పెరుగుతున్న ధరలతో బంగారు ఆభరణాలు మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షలా మారుతున్నాయి. తగ్గుతాయన్న ఆశలు కలగకముందే, మళ్లీ మళ్లీ పెరుగుతూనే ఉండటం కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఈరోజు బంగారం ధరల కదలికలు మరింత ఆశ్చర్యం కలిగించాయి. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల మధ్య కేవలం మూడు నుంచి నాలుగు గంటల్లోనే బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద మార్పు రావడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
దేశీయ బులియన్ మార్కెట్‌లో ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,830గా ఉండగా, 11 గంటల సమయానికి అది రూ.650 పెరిగి రూ.1,39,480కు చేరింది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,27,850 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయం రూ.1,38,830 నుంచి రూ.1,39,480కు పెరిగింది.
22 క్యారెట్ల బంగారం ధర కూడా ఉదయం రూ.1,27,260గా ఉండగా ప్రస్తుతం రూ.1,27,850గా ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరు, కోల్‌కతా, కేరళ ప్రాంతాల్లోనూ హైదరాబాద్ తరహా ధరలే నమోదవుతున్నాయి. అయితే చెన్నైలో మాత్రం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,400కు చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,630 వద్ద కొనసాగుతోంది.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గే సూచనలు ఇవ్వడం లేదు. వెండి ధరలు మరింత వేగంగా దూసుకుపోతున్నాయి.
ఈరోజు ఉదయం 6 గంటలకు కిలో వెండి ధర రూ.2,53,100గా ఉండగా, కేవలం మూడు గంటల్లోనే రూ.10,000 పెరిగి ఉదయం 11 గంటలకల్లా రూ.2,63,000కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి, ఆర్థిక పరిణామాలు, రాజకీయ ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ పరిస్థితులు కొనసాగితే సమీప కాలంలో ధరలు తగ్గే అవకాశాలు తక్కువేనని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Author: QAMAR SD
