వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: గత ఏడాది బంగారం, వెండి పెట్టుబడిదారులకు భారీ లాభాలు అందించాయి. పసిడి పెట్టుబడులు సుమారు 73 శాతం రిటర్న్స్ ఇవ్వగా, వెండి పెట్టుబడులు160 శాతం పైగా లాభాలు పంచాయి. ఈ నేపథ్యంలో వెనెజువెలాపై అమెరికా చేపట్టిన తాజా చర్యలు
అంతర్జాతీయ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.
మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ పరిణామాల వల్ల తక్షణంగా భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు తక్కువే.
భౌగోళిక ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, మార్కెట్లు వీటిని ఇప్పట్లో
స్పల్పకాలిక అనిశ్చితిగానే పరిగణిస్తున్నాయి. దీంతో సోమవారం బంగారం, వెండి ధరలు భారీ గ్యాప్‌తో కాకుండా,
కొద్దిపాటి లాభాలతోనే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
బంగారం ధరలను ప్రభావితం చేసే అంశాల్లో కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు కీలకంగా మారాయి. అనేక దేశాలు తమ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను పెంచుకుంటుండటం పసిడి ధరలకు మద్దతుగా నిలుస్తోంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు, అమెరికా వడ్డీ రేట్ల నిర్ణయాలు, డాలర్ మారకం విలువ కూడా రాబోయే రోజుల్లో బంగారం ధరలపై ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్ అంచనా ప్రకారం, రాబోయే కాలంలో ఔన్స్ మేలిమి బంగారం ధర 5,400 డాలర్లకు చేరే అవకాశం ఉంది.
వెండిలో బలం, చమురులో స్థిరత్వం
ఇటీవల కొద్దిపాటి కరెక్షన్ ఎదుర్కొన్న వెండి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. చైనా వెండి ఎగుమతులపై విధించిన ఆంక్షలు, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెరుగుతున్న పారిశ్రామిక వినియోగం వెండి ధరలకు బలంగా మారాయి.
సరఫరా–డిమాండ్ మధ్య వ్యత్యాసం పెరుగుతున్న నేపథ్యంలో,
వెండి ధరలు మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే ఔన్స్ వెండి ధర 100 డాలర్లకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ముడి చమురు ధరల విషయంలో మాత్రం పెద్ద మార్పులు కనిపించడం లేదు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 60 డాలర్ల పరిధిలోనే ట్రేడవుతోంది.
అమెరికా ఆంక్షలు ఎత్తివేస్తే వెనెజువెలా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు పెరిగే అవకాశం ఉంది. అలా జరిగితే రష్యా, పశ్చిమాసియా దేశాలతో చమురు ధరలపై భారత్‌కు బేరసారాల శక్తి పెరుగుతుంది.
భారత స్టాక్ మార్కెట్‌పై ఈ పరిణామాల తక్షణ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని నిపుణుల అంచనా. 2020 తర్వాత వెనెజువెలాతో భారత్‌కు వాణిజ్య సంబంధాలు పరిమితంగా ఉన్నాయి. అయితే అక్కడ పరిస్థితులు మెరుగుపడితే,
ఓఎన్‌జీసీ విదేశ్ సహా భారత కంపెనీలకు రావాల్సిన
సుమారు 1 బిలియన్ డాలర్ల (రూ.9,000 కోట్ల) బకాయిల వసూళ్లకు మార్గం సుగమమయ్యే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే, పసిడి, వెండి ధరల దిశను వెనెజువెలా పరిణామాల కంటే కూడా అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లు, డాలర్ ట్రెండ్ ఎక్కువగా ప్రభావితం చేయనున్నాయి.
పెట్టుబడిదారులు తాత్కాలిక వార్తలకంటే దీర్ఘకాలిక ధోరణులను గమనించడం అవసరం.
– Qamar SD

