📄 ePaper
Wednesday, February 4, 2026
📄 ePaper
HomeBusinessఅమెరికా–వెనెజువెలా ఉద్రిక్తతలు: బంగారం, వెండి ధరలకు రెక్కలు, ముడి చమురు మార్కెట్‌లో కలకలం

అమెరికా–వెనెజువెలా ఉద్రిక్తతలు: బంగారం, వెండి ధరలకు రెక్కలు, ముడి చమురు మార్కెట్‌లో కలకలం

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్:అంతర్జాతీయ మార్కెట్లలో మరోసారి అనిశ్చితి వాతావరణం నెలకొంది. అమెరికా, వెనెజువెలా మధ్య నెలకొన్న సైనిక ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ భౌగోళిక, రాజకీయ పరిణామాలు కమోడిటీ మార్కెట్లలో ఒడిదుడుకులను సృష్టిస్తున్నాయి.

వెనెజువెలాపై అమెరికా చేపట్టిన సైనిక చర్యల నేపథ్యంలో సముద్ర మార్గాల్లో అంతరాయాలు ఏర్పడవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ మార్గాల ద్వారానే ప్రపంచంలోని ప్రధాన ముడి సరుకుల రవాణా జరుగుతుండటంతో, గ్లోబల్ మార్కెట్లు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడులపై డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతోంది.

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లలో గోల్డ్ ధరలు కొత్త గరిష్టాలకు చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొమెక్స్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,300 డాలర్లకు పైగా కదలాడే సూచనలు కనిపిస్తున్నాయి. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తూ 75 నుంచి 80 డాలర్ల స్థాయిని తాకవచ్చన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ ప్రభావం భారత మార్కెట్‌పై కూడా పడనుంది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ అయిన ఎంసీఎక్స్‌లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.1,40,000 స్థాయిని తాకే అవకాశం ఉందని ట్రేడింగ్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే వెండి కిలో ధర రూ.2,45,000 వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పెరుగుతున్న పెట్టుబడిదారుల ఆసక్తి ఈ ధరల ఎగబాకటానికి మరింత బలం చేకూర్చవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

మరోవైపు ముడి చమురు ధరలపై కూడా ఈ ఉద్రిక్తతల ప్రభావం తప్పదని విశ్లేషకులు అంటున్నారు. సరఫరా మార్గాల్లో అంతరాయం ఏర్పడితే క్రూడ్ ఆయిల్ ధరలు వేగంగా పెరిగే అవకాశం ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 5,200 నుంచి 5,300 రూపాయల వరకు చేరవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

అయితే వెనెజువెలా ఆర్థిక వ్యవస్థ ప్రపంచ స్థాయిలో పెద్దదికాదని, భారత స్టాక్ మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం పరిమితంగానే ఉండొచ్చని కొంతమంది ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ గ్లోబల్ కమోడిటీ మార్కెట్లలో ఏర్పడుతున్న అనిశ్చితి పెట్టుబడిదారులను అప్రమత్తం చేస్తోంది.

రాబోయే రోజుల్లో అమెరికా–వెనెజువెలా సంబంధాలు మరింత క్షీణిస్తే, బంగారం, వెండి ధరల పరుగుకు అడ్డుకట్ట వేయడం కష్టమయ్యే పరిస్థితి తలెత్తవచ్చని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు మార్కెట్ పరిణామాలను జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

– Qamar SD

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page