📄 ePaper
Wednesday, March 25, 2026
📄 ePaper
HomeTelanganaAdilabad"జాకు" అనే నేను... "శిరీష్" అనే నేను...!!

“జాకు” అనే నేను… “శిరీష్” అనే నేను…!!

• ఘనంగా ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవం 

• ప్ర’గతి’ తప్పిన ఇచ్చోడ కు అభివృద్ధికి బాటలు చేస్తారని ఆశీర్వదించిన ఓటర్లు

• ప్రజా సేవకులకు పట్టం కట్టిన ఇచ్చోడ పట్టణ ప్రజలు 

• చాకులాంటి జాకులోని “జోష్”… శిరీష్ లోని “చురుకుదనం” ఇచ్చోడ మరింత అభివృద్ధికై బాటలు వేయాలి

సర్పంచ్ , ఉప సర్పంచ్లకు సవాళ్లు.. ప్రతి సవాళ్లు..

• బైపాస్ టు బైపాస్ రోడ్డు పనులు, సెంట్రల్ లైటింగ్ పనులు.. త్వరగా పూర్తి అయ్యేలా చొరవ తీసుకుంటే మేలు..

ప్రధాన రోడ్డు కూ ఇరువైపుల ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ ను మెరుగుపరచి సుందరీకరించాలి.

• పాలనలో అనుభవం ఉన్న వీరిద్దరిపైనే గంపెడు ఆశలు పెట్టుకున్న ఇచ్చోడ వాసులు.

• ఆదిలాబాద్ జిల్లాలోని మేజర్ గ్రామపంచాయతీ అయిన ఇచ్చోడ గ్రామపంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం.

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: “జాకు” అనే నేను… ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా “శిరీష్” అనే నేను… ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కల్గి ఉంటానని, భారత దేశ సార్వ బౌమత్వం, ఏకత్వాన్ని కాపాడు తానని, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం , నియమావళి, విధులు, బాధ్యతలను, భయం, పక్ష పాతం లేకుండా నిజాయితీతో నిర్వహిస్తానని ఇరువురు సోమవారం ఇచ్చోడ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రమాణం చేసారు. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ మేజర్ గ్రామపంచాయతీ అయిన ఇచ్చోడ పట్టణంలో నూతన పాలకవర్గం అధికారికంగా బాధ్యతలు స్వీకరించింది. ప్రజల విశ్వాసం, ఓటర్ల ఆశీర్వాదంతో “జాకు” సర్పంచ్‌గా, “శిరీష్” ఉప సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నిలిచింది. ప్రగతి తప్పిన ఇచ్చోడకు అభివృద్ధి బాటలు కావాలన్న ప్రజల తీర్పు.. ఇచ్చోడ ప్రజలు ఈ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు సాధారణమైనది కాదు. గత కొంతకాలంగా పట్టణంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వంటి అంశాలే ఈ మార్పుకు కారణమయ్యాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. “ఇచ్చోడకు ఇక అభివృద్ధి కావాలి… మాటలతో కాదు – పనులతో” అన్న స్పష్టమైన సంకేతాన్ని ఓటర్లు బ్యాలెట్ ద్వారా ఇచ్చారు.

ఇది కూడా చదవండి :  Social media post : మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టితే కఠిన చర్యలు

ప్రజా సేవకులకు పట్టం కట్టిన ఇచ్చోడ పట్టణ ప్రజలు..

సర్పంచ్, ఉప సర్పంచ్‌లుగా ఎన్నికైన జాకు, శిరీష్‌లు ఈ గెలుపును వ్యక్తిగత విజయంగా కాకుండా ప్రజా సేవకు ఇచ్చిన బాధ్యతగా భావిస్తున్నట్లు వారి మాటల్లో స్పష్టమైంది. ఇచ్చోడ పట్టణాన్ని ఆదిలాబాద్ జిల్లాలోనే ఆదర్శ మేజర్ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వారు ప్రకటించారు. సర్పంచ్ జాకు ప్రజల్లో చురుకైన నాయకుడిగా, నిర్ణయాత్మకత కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఉప సర్పంచ్ శిరీష్ పరిపాలనా అనుభవం, సమస్యలపై అవగాహన, వేగవంతమైన స్పందనకు పేరుగాంచారు. ఈ ఇద్దరి సమన్వయం ఇచ్చోడ అభివృద్ధికి బలమైన శక్తిగా మారుతుందన్న నమ్మకం ప్రజల్లో వ్యక్తమవుతోంది. సవాళ్లతో కూడిన బాధ్యతలు… ప్రతి సవాల్‌గా మార్చాల్సిన అవసరం.. మేజర్ గ్రామపంచాయతీ అయిన ఇచ్చోడలో సమస్యలు కూడా అంతే విస్తృతంగా ఉన్నాయి. పెరుగుతున్న జనాభా, వాణిజ్య విస్తరణ, ట్రాఫిక్ సమస్యలు, మౌలిక వసతుల కొరత వంటి అంశాలు నూతన పాలకవర్గానికి ప్రధాన సవాళ్లుగా నిలుస్తున్నాయి. అయితే ప్రజల మద్దతు, అనుభవం, ప్రభుత్వ సహకారంతో ఈ సవాళ్లను అవకాశాలుగా మలచగల సామర్థ్యం జాకు – శిరీష్‌లకు ఉందన్న విశ్వాసం వ్యక్తమవుతోంది.

బైపాస్ టు బైపాస్ రోడ్డు పనులు – అభివృద్ధికి కీలకం

ఇచ్చోడ పట్టణ అభివృద్ధిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం బైపాస్ టు బైపాస్ రోడ్డు నిర్మాణం. ఈ రోడ్డు నిర్మాణ పనులు గత కొంతకాలంగా నత్తనడకన నడుస్తున్నాయి. ఈ రోడ్డు పనులు త్వరత గతిన పూర్తి అయితే పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గడమే కాకుండా వాణిజ్య కార్యకలాపాలకు మరింత ఊతం లభిస్తుంది. ఈ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి అయ్యేలా కొత్త పాలకవర్గ సభ్యులు చొరవ తీసుకుంటే తొందరగానే పూర్తవుతాయి.

ఇది కూడా చదవండి :  రాజ్యాంగాన్ని కించపరిచిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

సెంట్రల్ లైటింగ్ – భద్రత, సుందరీకరణకు అవసరం..!!

పట్టణంలో సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమలైతే రాత్రివేళల్లో భద్రత పెరగడంతో పాటు పట్టణ సౌందర్యం మరింత మెరుగవుతుంది. ఈ పనులు అర్ధాంతరంగా ఆగిపోకుండా పూర్తి చేయడం నూతన పాలకవర్గానికి కీలక బాధ్యతగా మారింది. ఆదిలాబాద్ జిల్లాకు గర్వకారణమైన ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న ఇచ్చోడ పట్టణం వాణిజ్యం, రవాణా, విద్య రంగాల్లో కీలక కేంద్రంగా ఉంది. ఈ స్థాయికి తగ్గ అభివృద్ధి, మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ఇప్పుడు నూతన పాలకవర్గ భుజాలపై ఉంది.

డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుదల – ప్రజారోగ్యానికి కీలకం..

ప్రధాన రోడ్డుకు ఇరువైపుల ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను ఆధునీకరించడం, దృష్టి పెట్టడం అత్యవసరమని ప్రజలు కోరుతున్నారు. ఇది కేవలం సౌకర్యం మాత్రమే కాకుండా ప్రజారోగ్యానికి సంబంధించిన అంశమని పలువురు సూచిస్తున్నారు. పాలనలో అనుభవమే ప్రజల ఆశలకు బలమైన ఆధారం.. జాకు, శిరీష్ ఇద్దరికీ స్థానిక పాలనపై అనుభవం ఉండటమే ఇచ్చోడ ప్రజలు వీరిపై గంపెడు ఆశలు పెట్టుకునేలా చేసింది. ప్రధాన రోడ్డుకు ఇరువైపులా సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల గత కొన్ని సంవత్సరాల నుండి వర్షాకాలంలో వర్షపు నీరు వ్యాపార సముదాయాల్లోకి వెళ్లడం, అదేవిధంగా వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డుకి వైపులా ఉండే డ్రైనేజీ వ్యవస్థను సరైన ప్రణాళికతో నూతనంగా నిర్మిస్తేనే దీనికి సరైన పరిష్కారం లభిస్తుంది. జాకు – శిరీష్ నాయకత్వంలో ప్రజలతో కలిసి పాలన, ప్రజల కోసం అభివృద్ధి అన్న నినాదం కార్యరూపం దాల్చుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం.. ఇచ్చోడ ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు.. ఇచ్చోడ అభివృద్ధికి కొత్త శాసనం మొదలైంది…!!

ఇది కూడా చదవండి :  Operation kaghar | మావోయిస్టు టాప్ లీడర్ హిడ్మా లొంగిపోతాడా..?
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page