HomeTelanganaవరుణుడి కరుణ కోసం 'కప్పతల్లి' ఆటలు

వరుణుడి కరుణ కోసం ‘కప్పతల్లి’ ఆటలు

• వర్తమన్నూర్ గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో సంప్రదాయ పూజలు

• గ్రామ దేవతలకు జలాభిషేకాలు.. వానల కోసం అన్నదాతల ఆరాటం

 

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : వర్షాభావ పరిస్థితులతో ఆందోళన చెందుతున్న అన్నదాతలు వాన దేవుడి కరుణ కోసం పురాతన సంప్రదాయాలను ఆశ్రయించారు. సకాలంలో వర్షాలు కురిసి, గ్రామంలో సుభిక్షం నెలకొనాలని ఆకాంక్షిస్తూ ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని వర్తమన్నూర్ గ్రామాల్లో ఆదివారం గ్రామస్తులు ‘కప్పతల్లి’ ఆటలు నిర్వహించారు. ప్రకృతితో మమేకమైన ఈ ఆచారం గ్రామీణ సంస్కృతికి, రైతుల సమిష్టి విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది.

ఉదయం నుంచే మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరి కప్పతల్లిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం డప్పు వాయిద్యాల మధ్య గ్రామ వీధుల్లో ఊరేగించారు. వానదేవా… కరుణించు, పంటలు పండేలా వర్షాలు కురిపించు” అంటూ భక్తిగీతాలు పాడుతూ గ్రామమంతా ప్రదక్షిణ చేశారు. ఊరేగింపు సాగే మార్గంలో ప్రతి ఇంటి ముందు గ్రామస్తులు నీళ్లు పోసి కప్పతల్లికి స్వాగతం పలికారు. దీంతో గ్రామంలో కోలాహలంతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది.

వర్షాల కోసం గ్రామ దేవతలకు మొక్కులు..

వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న వర్తమన్నూర్ గ్రామాల్లో ఇటీవల తగినంత వర్షపాతం లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పొలాల్లో విత్తనాలు వేసిన రైతులు వరుణుడి కరుణ కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షాలు పుష్కలంగా కురవాలని, చెరువులు, కుంటలు నిండాలని, భూగర్భ జలాలు పెరిగి పశువుల తాగునీటి గోస తీరాలని కోరుకుంటూ గ్రామ దేవతల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పాలు, నీటితో జలాభిషేకాలు నిర్వహించి, కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు సమర్పించారు.

Farmers performing Kappatalli rituals for rain in Varthamannur Adilabad
Villagers of Varthamannur participating in the traditional Kappatalli procession to invoke the rain god for a good harvest.

ఈ సందర్భంగా పలువురు గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. “కప్పతల్లి ఆటలు ఆడితే వరుణ దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాడన్నది తరతరాలుగా వస్తున్న నమ్మకం. ప్రకృతిని ఆరాధించే మన గ్రామీణ జీవన విధానంలో ఈ సంప్రదాయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది” అని పేర్కొన్నారు. సాంకేతికత పెరిగిన ఈ ఆధునిక కాలంలోనూ యువతరం పాత ఆచారాలను మరువకుండా ఉత్సాహంగా పాల్గొనడం విశేషం.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సిడం ప్రభాకర్, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువతీయువకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular