* కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తక్షణమే బర్తరఫ్ చేయాలి
* ఎన్‌టీఏ పనితీరుపై సమీక్ష.. కఠిన చట్టాలు తేవాలి
* కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి డిమాండ్
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి డిమాండ్ చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా పార్లమెంట్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం ప్రజాస్వామ్య భారతదేశంలో మాయని మచ్చగా నిలిచిపోతుందని చంటి విమర్శించారు. ఈ దారుణానికి బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ యువతకు, విద్యార్థులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే నీట్ బాధిత విద్యార్థులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించి, విద్యా వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు తీసుకురావాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు, వారి ప్రతిభకు రక్షణ కల్పించేలా పరీక్షల వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, సాంకేతిక భద్రతను పెంచడంతో పాటు, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కఠినమైన చట్టాలను తీసుకురావాలని స్పష్టం చేశారు.
అలాగే, నీట్ పరీక్ష రద్దు కావడం, పేపర్ లీకేజీల వల్ల తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ప్రతి విద్యార్థి కుటుంబానికి కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని పసుల చంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం విద్యార్థులతో చర్చలు జరిపి వారి ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని, పర్యావరణ వేత్త, విద్యావేత్త సోనం వాంగ్చుక్‌ను వెంటనే పోలీసుల అదుపులో నుంచి విడుదల చేయాలని ఆయన కోరారు.
