ప్రపంచ మార్కెట్లలో బంగారం వెండి ధరలు క్రమక్రమం పెరగడంతో ఇప్పుడు ” ప్లాటినం ” హాట్ టాపిక్ మారింది. ఇప్పటివరకు బంగారం, వెండి చుట్టూనే తిరిగిన పెట్టుబడిదారుల దృష్టి ఇప్పుడు ఒక్కసారిగా ప్లాటినం (Platinum) వైపు మళ్లింది. కారణ ఏంటంటే ప్లాటినం ధరలు చరిత్రలోనే ఎన్నడూ లేని స్థాయికి చేరుకోవడమే. జనవరి 23న అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ ప్లాటినం ధర 0.4 శాతం పెరిగి ఔన్సుకు 2,639.40 డాలర్లకు చేరింది. ట్రేడింగ్ సమయంలో ఇది ఏకంగా 2,684.43 డాలర్లను తాకి ఆల్‌టైమ్ హై రికార్డును నమోదు చేసింది.
ఈ ధరల పెరుగుదల వెనుక కేవలం డిమాండ్ మాత్రమే కాదు, ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిణామాల ప్రభావం కూడా ఉంది. ముఖ్యంగా అమెరికా ఆర్థిక విధానాలపై నెలకొన్న అనిశ్చితి, డాలర్ బలహీనత ఇన్వెస్టర్లను ‘హార్డ్ అసెట్స్’ వైపు నడిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వాణిజ్య నిర్ణయాలు, యూరోపియన్ యూనియన్ పై టారిఫ్ హెచ్చరికలు గ్లోబల్ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ఇదే సమయంలో డాలర్ విలువ రెండు వారాల కనిష్టానికి పడిపోవడంతో ప్లాటినం వంటి లోహాలకు డిమాండ్ పెరిగింది.
చాలామందికి ప్లాటినం అంటే కేవలం ఆభరణాల లోహంగా మాత్రమే అని తెలుసు. కానీ వాస్తవానికి దీనికి పారిశ్రామికంగా విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో వాహనాల ఉద్గారాలను తగ్గించే కాటలిటిక్ కన్వర్టర్ల తయారీలో ప్లాటినం కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్స్, గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీల్లో కూడా దీనికి ప్రాధాన్యం పెరుగుతోంది. డిమాండ్ పెరుగుతుండగా, సరఫరా పరిమితంగా ఉండటం ధరలను మరింత ఎగబాకేలా చేస్తోంది.
ఇన్వెస్ట్‌మెంట్ పరంగా చూస్తే, ప్లాటినం ఇప్పుడు బంగారానికి ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఇప్పటికే బంగారం ధరలు ఎత్తైన స్థాయిలో ఉండటంతో, పోర్ట్‌ఫోలియో వైవిధ్యాన్ని కోరుకునే పెట్టుబడిదారులు ప్లాటినంపై దృష్టి పెడుతున్నారు. మన దేశంలో ప్లాటినంలో పెట్టుబడి పెట్టేందుకు మూడు ప్రధాన మార్గాలు ఉన్నాయి. మొదటిది ఫిజికల్ ప్లాటినం ప్రముఖ జ్యువెలరీ షాపుల్లో కాయిన్స్, బార్స్ రూపంలో కొనుగోలు చేయవచ్చు. అయితే PGI (Platinum Guild International) సర్టిఫికేషన్ ఉన్నదో లేదో తప్పనిసరిగా పరిశీలించాలి.
రెండవ మార్గం స్టాక్ మార్కెట్ ద్వారా ప్లాటినం ETFలలో పెట్టుబడి పెట్టడం. ఇది ఫిజికల్ మెటల్‌ను భద్రపరచాల్సిన అవసరం లేకుండా డిజిటల్ రూపంలో లాభాలను అందిస్తుంది. మూడవది MCX ద్వారా ప్లాటినం ఫ్యూచర్స్ ట్రేడింగ్. అయితే ఇది అధిక రిస్క్‌తో కూడుకున్నదైనందున అనుభవం ఉన్నవారికే అనుకూలం. ఫెడరల్ రిజర్వ్ రాబోయే కాలంలో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు కూడా ప్లాటినం, బంగారం వంటి వడ్డీ లేని ఆస్తులకు మద్దతునిస్తున్నాయి. అందుకే మార్కెట్ వర్గాలు ప్లాటినం ఇంకా కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని భావిస్తున్నాయి.

ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడల్లా విలువైన లోహాలు పెట్టుబడికి అణువుగా మారతాయి. ప్రస్తుతం ప్లాటినం ధరల దూకుడు అదే సంకేతాన్ని ఇస్తోంది. అయితే పెట్టుబడి ముందు మార్కెట్ హెచ్చుతగ్గులను గమనిస్తూ జాగ్రత్తగా అడుగులు వేయడం అవసరం.
Written by: Qamar SD, Vaasthava Nestham Editorial Team,Published: January 23, 2025 | 01:02 PM
