e-paper
Thursday, January 8, 2026
HomeBusinessRewind 2025: రాకెట్ వేగంతో బంగారం, పాతాళానికి రూపాయి.. ఈ ఏడాది మార్కెట్‌ను వెంటాడిన అనిశ్చితి

Rewind 2025: రాకెట్ వేగంతో బంగారం, పాతాళానికి రూపాయి.. ఈ ఏడాది మార్కెట్‌ను వెంటాడిన అనిశ్చితి

వాస్తవ నేస్తం,బిజినెస్ డెస్క్: 2025 సంవత్సరం దేశ ఆర్థిక–వాణిజ్య రంగానికి కీలక మలుపుల ఏడాదిగా నిలిచింది. ఒకవైపు జీఎస్టీ శ్లాబ్‌ల సవరణలతో మధ్యతరగతికి కొంత ఊరట లభించగా, మరోవైపు అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ట్రేడ్ వార్, టారిఫ్ వార్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థను నిరంతరం అనిశ్చితిలోకి నెట్టాయి.

బంగారం, వెండి ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్లగా, మన రూపాయి విలువ మాత్రం చరిత్రలోనే అత్యంత బలహీన స్థాయిలను తాకింది. స్టాక్ మార్కెట్లలోనూ ఈ ఏడాది మొత్తం ఊగిసలాట ధోరణే కనిపించింది.

అంతర్జాతీయ పరిణామాల ప్రభావం |  Global Uncertainty Impact

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న రాజకీయ, ఆర్థిక పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపాయి. ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న అస్థిరత అంతర్జాతీయ మార్కెట్లను కలవరపెట్టాయి. అదే సమయంలో అమెరికా పలు దేశాలపై విధించిన టారిఫ్‌లు గ్లోబల్ ట్రేడ్‌ను దెబ్బతీశాయి.

భారత్‌, చైనా సహా అనేక దేశాల ఎగుమతులపై అమెరికా ఎడాపెడా సుంకాలు విధించడంతో వాణిజ్య రంగంపై ఒత్తిడి పెరిగింది. టారిఫ్ భారం తగ్గించేందుకు భారత్ అమెరికాతో చర్చలు జరిపినా, ట్రేడ్ డీల్ స్పష్టతకు రాకపోవడం నిరాశ కలిగించింది. పలు దేశాలతో అమెరికా వాణిజ్య ఒప్పందాలను పూర్తి చేస్తేనే అంతర్జాతీయ ఆర్థిక వృద్ధికి ఊతం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బంగారం పరుగులు, రూపాయి పతనం | Gold Rally & Rupee Fall

అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావంతో ఈ ఏడాది బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి. సురక్షిత పెట్టుబడులుగా భావించే గోల్డ్, సిల్వర్ వైపు పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున మొగ్గుచూపడంతో ధరలు ఆకాశాన్ని తాకాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు కూడా పసిడి పరుగులకు మరింత బలం చేకూర్చాయి.

2024 డిసెంబర్‌లో తులం బంగారం ధర సుమారు రూ.75,000గా ఉండగా, 2025 చివరికి 10 గ్రాముల పసిడి ధర రూ.1,43,000 మార్క్‌ను దాటి పరుగులు పెట్టింది. ఒక్క ఏడాదిలోనే బంగారం ధరలు 80 శాతానికి పైగా పెరగడం విశేషం. అదే విధంగా వెండి ధరలు కూడా అంచనాలను మించి దూసుకెళ్లాయి. ఏడాది ఆరంభంలో కిలో వెండి దాదాపు రూ.లక్ష ధర పలుకగా, ఇప్పుడు అది రూ.2.5 లక్షల మార్క్‌ను చేరి సామాన్యుడికి దూరమైంది. ఏడాది వ్యవధిలో వెండి ధరలు ఏకంగా 165 శాతం పెరిగాయి.

ఇక స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే, ఈ ఏడాది మొత్తం అనిశ్చితి నీడలోనే గడిచింది. ద్వితీయార్థంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) ఎగ్జిట్ మోడ్‌లోకి వెళ్లడంతో పలు రంగాల షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. సెన్సెక్స్ ఈ ఏడాది 78,507 పాయింట్ల వద్ద ప్రారంభమై ప్రస్తుతం సుమారు 85,000 పాయింట్ల వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 23,742 పాయింట్ల వద్ద మొదలై 26,000 పాయింట్లకు చేరింది.

అయితే ఎఫ్‌ఐఐల నిష్క్రమణ, ట్రేడ్ డీల్స్‌లో జాప్యం, ఆర్బీఐ నుంచి ఆశించిన స్థాయిలో చర్యలు లేకపోవడం మన రూపాయిపై తీవ్ర ఒత్తిడిని తెచ్చాయి. ఒక దశలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 91కు చేరువ కావడం దేశీయ కరెన్సీ బలహీనతను స్పష్టంగా చూపించింది. రూపాయి పతనం వల్ల దిగుమతులు భారమవ్వడమే కాకుండా, నిత్యావసర ధరలు పెరిగే ప్రమాదం కూడా పెరిగింది.

మొత్తంగా చూస్తే, 2025 ఆర్థిక మార్కెట్లకు అనిశ్చితితో నిండిన ఏడాదిగా మిగిలింది. గ్లోబల్ పరిణామాలు, దేశీయ విధాన నిర్ణయాలు కలిసి మార్కెట్ల దిశను నిర్దేశించాయి. కొత్త ఏడాదిలోనైనా స్థిరత్వం నెలకొని, రూపాయి బలపడుతూ, స్టాక్ మార్కెట్లు తిరిగి పరుగులు పెడతాయా అన్నది వేచి చూడాల్సిందే.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page