📄 ePaper
Thursday, May 21, 2026
📄 ePaper
HomeCrime Newsమద్యానికి బానిసై వేధిస్తున్న భర్త.. తట్టుకోలేక హతమార్చిన భార్య.!

మద్యానికి బానిసై వేధిస్తున్న భర్త.. తట్టుకోలేక హతమార్చిన భార్య.!

• నిందితురాలి అరెస్ట్ : రిమాండ్‌కు తరలింపు

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: మద్యం మహమ్మారి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసింది. నిరంతరం మద్యం సేవించి శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న భర్తను భరించలేక, ఒక భార్య కఠిన నిర్ణయం తీసుకుంది. ఇనుప రాడ్‌తో తలపై బాది భర్తను హతమార్చిన ఘటన ఆదిలాబాద్ రూరల్ మండలం లోహార గ్రామంలో కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రూరల్ సీఐ ఫణిధర్ మీడియాకు వెల్లడించారు.

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణం హరిజనవాడకు చెందిన సోలంకి గణపతి, అతని భార్య మధురాబాయి కమ్మరి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పనుల నిమిత్తం గ్రామాలు తిరుగుతూ, పది రోజుల క్రితం లోహార గ్రామానికి చేరుకున్నారు. అక్కడ స్థానిక పాఠశాల సమీపంలో తాత్కాలికంగా డేరా వేసుకుని నివసిస్తున్నారు.

మృతుడు గణపతి గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. కష్టపడి సంపాదించిన డబ్బును మద్యం కోసం తగలేయడమే కాకుండా, నిత్యం భార్యను బూతులు తిడుతూ, శారీరకంగా హింసించేవాడు. భర్త వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన మధురాబాయి, అతడిని వదిలించుకోవాలని నిశ్చయించుకుంది. ఈ నెల 28న రాత్రి సమయంలో గణపతి మద్యం తాగి వచ్చి మళ్లీ గొడవ పడ్డాడు. అనంతరం అతను నిద్రిస్తున్న సమయంలో, మధురాబాయి ముందుగా సిద్ధం చేసుకున్న ఇనుప రాడ్‌తో అతడి తలపై బలంగా కొట్టింది. తీవ్ర గాయాలైన గణపతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడి కుమారుడు సోలంకి సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలు మధురాబాయిని అరెస్ట్ చేసిన పోలీసులు, హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆమెకు రిమాండ్ విధించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular