వ్యవస్థీకృత లోపం- పరిష్కారం ఎక్కడ.?
ప్రపంచ వేదికలపై ఒక చిన్నారి చేసిన గట్టి విమర్శ యావత్ సమాజాన్ని ప్రశ్నించింది. పర్యావరణ పరిరక్షణ కోసం పిలుపునిచ్చిన ఆ బాలిక.. ప్రపంచ నాయకులను ఉద్దేశించి, “మీరు మా బాల్యాన్ని, కలలను దొంగిలించారు” అని నిలదీయడం, పెద్దల బాధ్యతారాహిత్యంపై వ్యవస్థల వైఫల్యంపై వేసిన ప్రశ్నగా చూడాలి. ఈ ‘నిందించే వైఖరి’ చరిత్రలో కొత్తదేమీ కాదు. క్రీస్తు పూర్వం 2,700 ఏళ్ల నాటి కవి హెసియడ్ రచనల నుండే ‘యువతరం వినయం కోల్పోయింది’ అనే నింద ఉంది. నాటి మేధావుల నుంచి నేటి వరకు, ప్రతీ తరం పెద్దలు యువతపై అపనిందలు మోపారు. కానీ ఈ తరం పిల్లలు తిరగబడుతున్నారంటే.. దానికి కేవలం క్రమశిక్షణ లేకపోవడం ఒక్కటే కారణం కాదు. మన పెంపక పద్ధతులలో, బాలల హక్కుల పరిజ్ఞానం లో ఉన్న మూల లోపాలే ప్రధానమైన కారణం.
శారీరక దండన వద్దు! ప్రాచీన విశ్లేషణలు ఎలా ఉన్నా, ఆధునిక న్యాయ సూత్రాలు పెంపక విధానంలో స్పష్టత ఇస్తున్నాయి. మన దేశ రాజ్యాంగం ప్రకారం, ప్రతి బిడ్డకు గౌరవంతో జీవించే హక్కు ఉంది. శిక్ష ద్వారా వారిలో భయాన్ని పెంచడం అనేది బాలల హక్కుల ఒప్పందానికి ఉల్లంఘన అవుతుంది. శారీరక దండన గౌరవాన్ని ఎప్పటికీ నేర్పదు; అది కేవలం హింసను ప్రేరేపిస్తుంది. పిల్లలలో అహంకారం, మొరటుతనం పెరగడానికి కారణాలు మన తప్పుడు పెంపక పద్ధతులే. అతి గారాబం కారణంగా.. ‘తమకు అన్నీ లభించాల్సిందే’ అనే ప్రమాదకర ఆలోచన వారిలో పెరుగుతోంది. మరోవైపు, ఆర్థిక ఒత్తిడిలో తల్లిదండ్రులు చిక్కుకుని, పిల్లల మానసిక, భావోద్వేగ అవసరాలను పట్టించుకోకపోవడం వారి భద్రతకు భంగం కలిగిస్తుంది. పిల్లలను భయంతో పెంచడం ఆపి.. బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకునేలా ప్రేరణ ఇవ్వాలి.
సమతుల్య పెంపకమే కీలకం: పిల్లలలో అహంకారాన్ని తగ్గించి, వినయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఉన్న ఏకైక ఉత్తమ మార్గం అధికారిక పెంపకము (నియంత్రణతో కూడిన వాత్సల్యం). ఇది ప్రేమ, నియమాలకు మధ్య సరైన సమతుల్యతను సాధిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలతో అపారమైన ప్రేమ, ఆప్యాయత చూపుతూనే, స్పష్టమైన నిబంధనలను తప్పనిసరిగా చూపాలి. తప్పు చేస్తే వారిని దండించడం మానేసి, దాని పర్యవసానం ఏమిటో తార్కికంగా, సానుభూతితో వివరించాలి. శిక్ష కన్నా, పరిణామం నేర్పించడమే ఇక్కడ అత్యంత ముఖ్యం. ఈ సమతుల్య పద్ధతి ద్వారా పెరిగే పిల్లలు ఉన్నతమైన స్వీయ-నియంత్రణ కలిగి, నిజమైన వినయంతో, బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారు. ఈ విధానమే నేటి సామాజిక న్యాయానికి కీలకం.
మార్పు మన నుండే ఆరంభం కావాలి!గ్రెటా థన్‌బెర్గ్ లాంటి బాలలు మనపై ఉంచిన సామాజిక బాధ్యత నుంచి మనం పారిపోలేం. మన పిల్లల భవిష్యత్తును దొంగిలించే నాయకులుగా మనం ఉండకూడదు. పెంపకంలో న్యాయబద్ధతను, గౌరవాన్ని పాటించాలి. శిక్షను ఆయుధంగా ఉపయోగించడం ఆపి.. ప్రేమను, మార్గదర్శకత్వాన్ని వారి అభివృద్ధికి మార్గాలుగా మలచాలి. మన పెంపకం కేవలం విధేయతను మాత్రమే కాకుండా.. సమస్యలను విశ్లేషించి, పరిష్కరించే శక్తిని వారికి అందించాలి. ఈ సామాజిక మార్పు మన నుండే మొదలు కావాలి. రేపటి ప్రపంచానికి మనమే సరికొత్త నాయకత్వాన్ని అందించాలి.
వ్యాసకర్త : ఫిరోజ్ ఖాన్, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ 9640466464 )
