• బజార్‌హత్నూర్ తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగిపై ఏసీబీ కేసు
• సదా బైనామా రిజిస్ట్రేషన్ కు లంచం డిమాండ్ చేసిన అధికారి
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్త తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. రూ.2 లక్షల లంచం తీసుకుంటున్న సమయంలో ఆయనను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రెస్ నోట్,లో ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో విద్యాసాగర్ రెడ్డిని పట్టుకున్నారు. బలాన్పూర్ శివార్ పరిధిలోని సర్వే నెం.11/Aలో ఉన్న 8.35 ఎకరాల భూమికి సంబంధించిన సదా బైనామా రిజిస్ట్రేషన్ ఫైల్‌ను ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేయడానికి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. రూ.2 లక్షలు నగదును నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అధికారిక విధులను సరిగా నిర్వహించకుండా, అక్రమ లాభం పొందాలనే ఉద్దేశంతో నిందితుడు దురుద్దేశపూరితంగా వ్యవహరించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి, కరీంనగర్‌లోని ఎస్పీఈ & ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేసినట్లయితే ప్రజలు వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. లేదా చరవాణి నంబర్ 9440446106 కు సంప్రదించాలన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.
