• తీర్పు వెలువరించిన బోథ్ కోర్టు న్యాయమూర్తి కుంభ సందీప్
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: జిల్లాలోని సిరికొండ మండలంలోని పొన్న గ్రామంలో చోటుచేసుకున్న ఓ దాడి కేసులో నిందితుడికి బోథ్ కోర్టు రూ.1,000 జరిమానా విధించింది. ఈ మేరకు బోథ్ కోర్టు న్యాయమూర్తి కుంభ సందీప్ కీలక తీర్పు వెలువరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2021 నవంబర్ 21వ తేదీ రాత్రి పొన్న గ్రామానికి చెందిన నవగారే నారాయణపై అదే గ్రామానికి చెందిన ఇంగోలే ఎకనాథ్ (40) అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. డోక్రా గ్రూపు నుంచి తన పేరు ఎందుకు తొలగించారని నారాయణను ప్రశ్నిస్తూ.. దుర్భాషలాడి చేతులతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనపై బాధితుడి భార్య నవగారే నాగబాయి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి కుంభ సందీప్.. నిందితుడు ఎకనాథ్ పై నేరం రుజువు కావడంతో అతనికి రూ.1,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
ఈ కేసులో నేరం రుజువయ్యేలా కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సతీష్, కోర్టు డ్యూటీ అధికారి రాజారెడ్డి, లైజన్ ఆఫీసర్ జి. పండరిలను ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చిన్నచిన్న వివాదాల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులు, గొడవలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేరాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించి, శాంతియుత సమాజ నిర్మాణానికి పోలీసులకు సహకరించాలని ఆయన సూచించారు.
