• వృద్ధాశ్రమంలో అనాథలా కన్నుమూసిన మాజీ వ్యాపారవేత్త
• అంత్యక్రియలకు రూ.5,100 పంపి చేతులు దులుపుకున్న కుమార్తెలు
• మంటగలుస్తున్న మానవ సంబంధాలకు సజీవ సాక్ష్యం ఈ ఘటన
• హరియాణాలోని సోనిపట్‌లో హృదయ విదారక ఉదంతం
వాస్తవ నేస్తంవెబ్ డెస్క్: రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన కన్నప్రేమ పట్ల ఆప్యాయత, బాధ్యతలు ఏమైపోతున్నాయి..? నేటి సమాజంలో యంత్రాల్లా మారుతున్న మానవ సంబంధాలు, మంటగలిసిపోతున్న నైతిక విలువలకు తాజాగా హరియాణాలో జరిగిన ఓ హృదయ విదారక ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. బతికి ఉన్నప్పుడు తండ్రిని పట్టించుకోని పిల్లలు.. ఆయన కన్నుమూశాక కడసారి చూపు కోసం కూడా రాలేక వీడియో కాల్ ద్వారా అంత్యక్రియలు వీక్షించిన అమానవీయ ఘటన సభ్యసమాజాన్ని నివ్వెరపరుస్తోంది. ఆస్తులున్నా.. అనాథ శవంగానే.. వివరాల్లోకి వెళితే.. హరియాణాలోని సోనిపట్‌కు చెందిన ఒకప్పటి ప్రముఖ వ్యాపారవేత్త జీవిత చరమాంకంలో ఆదరణ కరువై, ఒంటరితనంతో కుమిలిపోతూ స్థానిక వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. ఒకప్పుడు ఆస్తులు, అంతస్తులు సంపాదించి, తన పిల్లలను ఉన్నత స్థితిలో నిలబెట్టినా.. ఆయన చివరి ప్రయాణంలో మిగిలింది మాత్రం అనాథ శవంగా మారిన వేదనే…
వీడియో కాల్ దర్శనం.. రూ. 5,100 పారితోషికం!
కన్నతండ్రి కన్నుమూశాడన్న వార్త తెలిసినా కుమార్తెలు కడసారి చూపుకైనా రాలేదు. ఆఖరికి తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరుకాకుండా, మొబైల్ ఫోన్‌లో వీడియో కాల్ ద్వారా వీక్షిస్తూ సరిపెట్టుకున్నారు. కనీసం తండ్రి చివరి కార్యాల ఖర్చుల కోసం ఓ రూ.5,100 ఆన్‌లైన్‌లో పంపి తమ బాధ్యత తీరిపోయిందనుకున్నారు. ఈ లోకంలోకి తీసుకొచ్చి, విద్యాబుద్ధులు నేర్పి, సమాజంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టిన తల్లిదండ్రుల పట్ల ఈ తరహా నిర్లక్ష్యం భవిష్యత్తులో ఇంకెన్ని అనర్థాలకు దారి తీస్తుందోనని స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. డబ్బే సర్వస్వం అనుకుంటూ కన్నపేగు బంధాన్ని సైతం మర్చిపోతున్న ఈ హైటెక్ యుగంలో, ఆ వ్యాపారవేత్త దీనస్థితి సమాజం ఎటు పోతోందో అన్న ప్రశ్నను రేకెత్తిస్తోంది.
