HomeBreaking NewsHelium Gas | గదిలోకి మాస్క్ లేకుండా రావొద్దు..

Helium Gas | గదిలోకి మాస్క్ లేకుండా రావొద్దు..

ఆన్‌లైన్ బెట్టింగ్స్ కు బలి: ‘హీలియం’ పీల్చి సీఏ ఆత్మహత్య

 * యూట్యూబ్‌లో సెర్చ్ చేసి మరీ ప్రాణాంతక టెక్నిక్ అమలు

 * నొప్పి లేకుండా చనిపోవాలనే ఆలోచనే ఈ దారుణానికి కారణం

 * కుటుంబానికి క్షమాపణలు చెబుతూ సూసైడ్ నోట్

 * సిద్దిపేటలో కలకలం రేపిన విషాద ఘటన

 

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ఆన్‌లైన్ బెట్టింగ్స్ మరో నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. భారీగా డబ్బులు పోగొట్టుకుని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ యువ చార్టర్డ్ అకౌంటెంట్ తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, నొప్పి లేకుండా చనిపోవాలనే ఉద్దేశంతో యూట్యూబ్‌లో సెర్చ్ చేసి మరీ ‘హీలియం గ్యాస్’ను పీల్చి ప్రాణాలు వదలడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషాద ఘటన మంగళవారం సిద్దిపేటలో వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన సంతోష్ అనే యువకుడు సీఏగా పని చేస్తున్నాడు. ఇటీవల ఆన్‌లైన్ బెట్టింగ్స్‌కు బానిసై పెద్ద ఎత్తున డబ్బులు కోల్పోయాడు. అప్పులు ఎలా తీర్చాలో దారి తోచని పరిస్థితుల్లో మంగళవారం సిద్దిపేట బైపాస్ రోడ్డులోని హరిత హోటల్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. తన ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కలచివేస్తున్న సూసైడ్ నోట్..

చనిపోయే ముందు తనకు ఎలాంటి నొప్పి తెలియకుండా ప్రాణాలు ఎలా వదలాలి అని సంతోష్ యూట్యూబ్‌లో వెతికినట్లు తెలిసింది. చివరకు హీలియం గ్యాస్ టెక్నిక్ గురించి తెలుసుకుని దాన్ని అమలు చేశాడు. ఆత్మహత్యకు ముందు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు క్షమాపణలు చెబుతూ సంతోష్ ఓ సూసైడ్ నోట్ రాశాడు. అయితే, తాను చనిపోయిన తర్వాత తన గదిలోకి వచ్చే వారిపై ఆ గ్యాస్ ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో.. తలుపుపై “గదిలోకి మాస్క్ లేకుండా రావొద్దు” అంటూ ఓ ప్రత్యేక సూచన రాసిపెట్టడం అక్కడికి చేరుకున్న వారిని కంటతడి పెట్టించింది.

విస్తరిస్తున్న డేంజరస్ ట్రెండ్ : 

నొప్పి లేకుండా సునాయాసంగా ప్రాణాలు వదలొచ్చనే అపోహతో యువత ‘హీలియం గ్యాస్’ను ఆశ్రయిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి మరీ ఈ టెక్నిక్‌ను వాడుతున్నారు. గత ఏడాది హైదరాబాద్‌లోని మణికొండలో ప్రైవేట్ కంపెనీలో సీఏగా పనిచేసే సురేష్ రెడ్డి, అలాగే విశాఖకు చెందిన అఖిల్ అనే యువకుడు కూడా అచ్చం ఇలాగే హీలియం గ్యాస్‌ పీల్చి ప్రాణాలు తీసుకోవడం గమనార్హం. అమెరికాలో మొదలైన ఈ ప్రాణాంతక ట్రెండ్ ఇప్పుడు దేశంలోనూ ‘సైలెంట్ కిల్లర్’గా మారుతోంది.

సాధారణంగా బెలూన్లలో వాడే హీలియం గ్యాస్‌కు రంగు, వాసన ఉండవు. గాలి కంటే తేలికైన ఈ గ్యాస్ సహజంగా ప్రమాదకరమైనది కాదు. కానీ.. ఊపిరితిత్తులకు ఆక్సిజన్ అందాల్సిన స్థానంలోకి హీలియంను పంపితే, అది ఆక్సిజన్‌ను పూర్తిగా రీప్లేస్ చేస్తుంది. తద్వారా మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి, మొద్దుబారిపోయి, స్పృహ కోల్పోయి మనిషి మరణిస్తాడు. అయితే, ‘హీలియం పీల్చి చనిపోతే ఎలాంటి నొప్పీ ఉండదు’ అనేది కేవలం అపోహ మాత్రమేనని, ప్రాణం పోయేటప్పుడు కచ్చితంగా నొప్పి, తీవ్రమైన ఉక్కిరిబిక్కిరి ఉంటాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. యువత క్షణికావేశంలో తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు కన్నవారికి తీరని గర్భశోకాన్ని మిగుల్చుతున్నాయని మానసిక నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నా, ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నా వెంటనే ఈ క్రింది ఉచిత టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించి కౌన్సెలింగ్ పొడవచ్చు.

• టెలి-మానస్ (Tele-MANAS): 14416 లేదా 1800-891-4416

• కిరణ్ (KIRAN): 1800-599-0019

• హైదరాబాద్ ఆత్మహత్య నిరోధక హెల్ప్‌లైన్: 7893078930

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular